పులివెందుల బహిరంగ సభలో సీఎం జగన్ భావోద్వేగం
పులివెందుల నా ప్రాణం అంటూ.. మొదలుపెట్టిన సీఎం జగన్
వైఎస్సార్ చలవతో కరువు ప్రాంతం నుంచి అభివృద్ధి పరుగులు
టీడీపీ మాఫియాను ఎదురించింది పులివెందుల బిడ్డలే
వైఎస్సార్ వారసులమంటూ పసుపు చీరలు కట్టుకుని కొందరు వస్తున్నారు
వైఎస్సార్ లెగసీని దెబ్బ తీసినవాళ్లతో చేతులు కలిపిన వీళ్లా వారసులు?
షర్మిల, సునీతలపై సీఎం జగన్ ఫైర్
వివేకాను చంపిందెవరో ప్రజలకు తెలుసు
అవినాష్ ఏ తప్పూ చేయలేదు.. అది బలంగా నమ్మాను కాబట్టే సీటు ఇచ్చా
నా చెల్లెమ్మలతో నడిపిస్తున్న ఈ కుట్రను, చెడిపోయిన రాజకీయాల్ని ప్రజలు గమనిస్తున్నారు
పాలనలో మీ బిడ్డ సీఎం జగన్‌ను కొట్టేవాళ్లెవరూ లేరు
మళ్లీ ఆశీర్వదించాలని పులివెందుల ప్రజల్ని కోరుతున్నా
వైఎస్సార్, సాక్షి: ఒకప్పుడు కరువు ప్రాంతంగా పేరున్న పులివెందులకు.. ఇప్పుడు కృష్ణా జలాలు వస్తున్నాయి. నా తండ్రి, ఆ మహానేత దివంగత నేత వైఎస్సార్ వల్లే ఈ అభివృద్ధి పరుగులు అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఉదయం ఎన్నికల నామినేషన్ కోసం పులివెందుల వెళ్లిన సీఎం జగన్.. అంతకు ముందు సీఎస్‌ఐ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
‘‘నా పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. ప్రతీ కష్టంలో నా వెంట నడిచిన ప్రతీ ఒక్కరికీ మీ జగన్, మీ బిడ్డ ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెబుతున్నాడు. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, ఒక సక్సెస్ స్టోరీ. ఈ అభివృద్ధికి కారణం వైఎస్సార్. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. పులివెందులలో ఏం ఉంది? అనే స్థాయి నుంచి పులివెందులలో ఏం లేదు? అనే స్థాయికి చేరుకున్నాం. అందుకే పులివెందుల ఒక విజయగాథ..
.. పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. మంచి చేయడం, మంచి మనసుతో ఉండడం, బెదిరింపులకు లొంగకపోవడం, మాట తప్పకపోవడం మన కల్చర్. టీడీపీ మాఫియా, నాలుగు దశాబ్దాల దుర్మార్గాన్ని ఎదురించింది ఈ పులివెందుల బిడ్డేలే.
.. వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బ తీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. ఆ కుట్రలో భాగంగా ఈ మధ్య వైఎస్సార్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారు. అసలు ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు?.. ప్రజలే. మీ బిడ్డను ఎదుర్కొనలేక వీళ్లంతా ఏకం అయ్యారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీలతో పాటు నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలో భాగం అయ్యారు.
.. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు?.. నాన్నగారిపై కక్షతో, కుట్రపూర్వకంగా కేసులు పెట్టింది ఎవరు?. వైఎస్సార్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చింది ఎవరు?. వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను చెరిపేయాలని, వైఎస్సార్‌సీపీకి పేరు దక్కవద్దని, విగ్రహాలు తొలగిస్తామని చెబుతున్నవాళ్లు, ఆ పార్టీలతో చేతులు కలిపినవాళ్లా? వైఎస్సార్ వారసులా?.. పసుపు చీరలు కట్టుకుని వైఎస్సార్ శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు, ఆ పార్టీలో చేరిన వాళ్లు వాళ్లా వైఎస్సార్ వారసులు?.. అని ప్రశ్నిస్తున్నా.
.. YSR పేరు కనబడకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. నోటాకు వచ్చినన్ని ఓటర్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటేస్తారా?. కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబుకి ఓటేసినట్లు కాదా?. మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా? కాదా?.
.. నా చిన్నాన్న వివేకాను చంపింది ఎవరో దేవుడికి, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. వివేకాను చంపిన నిందితుడికి మద్దతు ఇస్తుంది ఎవరు?. వివేకాకు రెండో భార్య ఉన్నది, సంతానం ఉన్నది వాస్తవం కాదా?. ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే.. అవినాష్ అక్కడికి వెళ్లారు?. పలు ఇంటర్వ్యూల్లో అవినాష్ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా!. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదు. అది బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చాను. అవినాష్‌రెడ్డి జీవితం నాశనం చేయాలని చూస్తున్నారు. అవినాష్‌ను కనుమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ఆలోచించండి.
ఇదీ చదవండి: సునీత, దస్తగిరి లాలూచీ!.. అవినాష్ లేవనెత్తిన అభ్యంతరాలు ఏంటంటే..
.. బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో మీ అందరికీ కనిపిస్తోంది. పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గం. చిన్నాన్న వివేకాను అన్యాయంగా ఎన్నికల్లో ఓడించిన వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు?. తమ సొంత లాభంకోసం ఎవరు ఈ కుట్ర చేయిస్తున్నారో ప్రజలు గమనించాలి. ప్రతీ ఒక్కరూ చెడిపోయిన ఈ రాజకీయాలను చూడండి.
.. పరిపాలనలోనూ, పథకాల్లోనూ, సంక్షేమంలోనూ జగన్‌ను ఎవరూ కొట్టలేరు. ఏ రంగంలోనూ జగన్ కంటే మంచి చేశామని వాళ్లు చెప్పుకోలేరు. వైఎస్సార్, జగన్ పేర్లు చెరిపేయాలని చూసేవాళ్లు మన శత్రువులే. జగన్ బ్రాండ్, వైఎస్సార్ బ్రాండ్‌ను దెబ్బ కొట్టాలని చూస్తున్నవాళ్లకు గుణపాఠం చెప్పడానికి పులివెందుల సిద్ధమా? అని సీఎం జగన్ గర్జించారు. ఎక్కడా లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. పులివెందుల వాసుల చిరకాల కల మెడికల్ కాలేజీ. త్వరలో ఆ కాలేజీ ప్రారంభిస్తాం. పేదలకు మంచి చేయాలని ఆ దేవుడు మీ బిడ్డకు సీఎం పదవి ఇచ్చాడు. అందుకే మరింత మంచిని అందించే అవకాశం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment