నారా లోకేష్‌పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది? | AP TDP Leaders Discuss Over Nara Lokesh Absence In Meetings | Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌పై టీడీపీలో కొత్త చర్చ.. అసలేం జరుగుతోంది?

Published Tue, Mar 19 2024 2:03 PM | Last Updated on Tue, Mar 19 2024 2:53 PM

AP TDP Leaders Discuss Over Nara Lokesh Absence In Meetings - Sakshi

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారాల పుత్రుడు.. ఆయన రాజకీయ వారసుడు నారా లోకేష్ పార్టీ నిర్వహించే ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఎందుకని లోకేష్‌ను  కీలక సభలకు దూరం పెడుతున్నారు చంద్రబాబు?.

పార్టీలో విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం లోకేష్‌ది ఐరన్ లెగ్ అని చంద్రబాబు భయపడుతున్నారట. అందుకే  ఎన్నికలయ్యే వరకు కీలక సభల్లో లోకేష్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఆయన స్థానంలో దత్త పుత్రుడు  పవన్ కల్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని షోలు రన్ చేయాలని డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.

నారా లోకేష్.. నారావారి ముద్దుల కొడుకు. నందమూరి వారి ముద్దుల అల్లుడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేక చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మంత్రి పదవి అందుకుని ఎమ్మెల్సీ అయిన వ్యక్తి. అంచెలంచెలుగా కాకుండా వాయువేగంతో ప్రమోషన్లపై ప్రమోషన్లు కొట్టేసిన రాజకీయ వారసుడు. అయిదేళ్ల పాటు మంత్రి పదవిని అనుభవించిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో మంగళగిరిలో దారుణంగా ఓడిన నాయకుడు. 

చంద్రబాబు ఎలాగో ఒక లాగ అధికారంలోకి వస్తే  సీఎం సీటుపై ఓసారి కూర్చోవాలని ఆకాంక్షిస్తోన్న ఆశావహుడు కూడా. పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడటంతో తనయుడిని రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు యువగళం పేరిట పాదయాత్రకు ప్లాన్ చేశారు చంద్రబాబు. అది  కాస్తా జనం లేక ఫ్లాప్ కావడంతో చంద్రబాబు జైలుకెళ్లిన సందర్భాన్ని అంది పుచ్చుకుని పాదయాత్రను మమా అనిపించారు.

పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్‌ను కీలక నేతగా చేసి పెట్టారు చంద్రబాబు నాయుడు. అది పార్టీలోని చాలా మంది సీనియర్లకు నచ్చకపోయినా మౌనంగా ఉండిపోయారు. 2019లోనే టీడీపీ గెలిస్తే లోకేష్‌ను సీఎం సీటుపై కూర్చోబెట్టి తాను రాజకీయంగా కాస్త రెస్ట్ తీసుకుందామనుకున్నారు చంద్రబాబు. అయితే, టీడీపీ అధికారంలోకి రాలేదు సరికదా గౌరవప్రదమైన స్కోరు కూడా సాధించలేకపోయింది. కేవలం 23 అసెంబ్లీ సీట్లు మూడు లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ క్రమంలో నారా లోకేష్ తన నియోజకవర్గంలో గెలవలేక చేతులెత్తేశారు. అయినా గెలిచిన సీనియర్లపై లోకేష్ పెత్తనం చేసే అవకాశం దక్కింది.

ఆ అధికారంతోనే ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల ఎంపికలోనూ నారా లోకేష్ జోక్యం చేసుకుని కొందరు ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు ఇప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్‌తో కలిసి హడావిడి చేశారు. తండ్రికి బెయిల్ ఇప్పించుకోవడం కోసం ఢిల్లీలోనే మకాం వేసి బీజేపీ అగ్రనేతలను తన పెద్దమ్మ పురందేశ్వరి సౌజన్యంతో కలవగలిగారు. చంద్రబాబు బెయిల్‌పై విడుదలైన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు లోకేష్. ఇటువంటి లోకేష్ కొద్ది రోజులుగా పార్టీ తరపున జరిగే కీలక కార్యక్రమాల్లో కనపడటంలేదు. ఆయన ఎందుకు మిస్ అవుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు.

టీడీపీ-జనసేనల పొత్తు ఖరారు అయిన తర్వాత రెండు పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా తాడేపల్లిగూడెంలో జెండా సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఎన్నికల ముందు టీడీపీ నిర్వహించే అత్యంత కీలకమైన ఈ కార్యక్రమంలో లోకేష్ ఎక్కడా కనపడలేదు. ఆయన ఎందుకు రాలేదు అన్న అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ నడిచింది. ఆ వెంటనే టీడీపీ-జనసేనలు తమ తమ అభ్యర్ధుల  జాబితాలను విడుదల చేశాయి. రెండు జాబితాలు విడుదల చేస్తే ఆ రెండింటికీ నారా లోకేష్ దూరంగానే ఉన్నారు. ఆయనే దూరంగా ఉన్నారా? లేక నాయకత్వమే దూరం పెట్టిందా? అన్న చర్చ  జరుగుతోంది. చాలా ముఖ్యమైన ఈ కార్యక్రమంలో చంద్రబాబు-పవన్, నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారే తప్ప లోకేష్ రాలేదు. ఆయన వేరే పనిలో బిజీగా ఉన్నారా అనడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభ్యర్ధుల జాబితా విడుదలను మించిన బిజీ కార్యక్రమం ఇంకేముంటుంది?. 

బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు.. అమిత్ షాను కలవడానికి ఢిల్లీ వెళ్లినపుడూ ఆయనతో లోకేష్ లేరు. దత్తపుత్రుడు చంద్రబాబు మాత్రమే ఉన్నారు. సరే అపుడు టీడీపీ ప్రతినిధిగా చంద్రబాబు.. జనసేన తరపున లోకేష్ ఉన్నారని సరిపెట్టుకోవచ్చు. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా చిలకలూరిపేటలో ప్రజాగళం పేరిట నిర్వహించిన సభలో కూడా నారా లోకేష్  కనపడలేదు. చంద్రబాబు,  పవన్, దగ్గుబాటి పురందేశ్వరిలతో పాటు  టీడీపీ, బీజేపీ సీనియర్లు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కూడా నారా లోకేష్ వేదికపై లేరు. నిజానికి ఈ సభ ఏర్పాట్లు  చేసేందుకు శ్రీకారం చుట్టినపుడు లోకేష్ ఉన్నారు. కానీ,  అసలు సభలో మాత్రం ఆయనకు చోటు లేకుండా పోయింది. వేదిక కింద ఉన్నారాయన. దీనిపై టీడీపీ వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది.

వరుసగా ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలోనూ నారా లోకేష్ పాల్గొనకపోవడానికి కారణాలు ఏంటి? పార్టీ నాయకత్వంపై కానీ తన తండ్రిపై కానీ లోకేష్ అలిగారా? లేక పొత్తులపై ఆయనకు అసంతృప్తి ఏమన్నా ఉందా? లేక తనకు సరైన విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా? అని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే అసలు విషయం వేరే ఉందని చంద్రబాబుకు సన్నిహితులైన వారు చెబుతున్నారు. 

నారా లోకేష్ పాల్గొన్న సభలు పార్టీకి అచ్చి రావడంలేదని చంద్రబాబు భావిస్తున్నారట. ఎన్నికల తంతు పూర్తి అయ్యేవరకు లోకేష్ లెగ్ సభావేదికలపై లేకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. అందుకే ఆయన్ను మంగళగిరిలో ప్రచారం చేసుకోమని చెప్పి చిలకలూరి పేటలో సభ పెట్టేసుకున్నారు చంద్రబాబు. పార్టీ అధ్యక్షుడు కన్న తండ్రే తనను నియోజకవర్గానికి పరిమితం అవ్వమని చెప్పడంతో లోకేష్ అయిష్టంగానే మంగళగిరిలో తిరుగుతున్నట్లు పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement