
సాక్షి, గుంటూరు: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యవహరించడంపై 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ‘నిజం గెలవాలి’ పేరుతో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ఆర్థిక సహాయం పేరుతో నగదును భువనేశ్వరి పంపిణీ చేయడంపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదుపై ఎన్నికల కమిషన్ స్పందించింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ నెల 20న నారా భువనేశ్వరీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని.. ఇది ఎన్నికల రూల్స్ ప్రకారం ప్రలోభాల కిందకే వస్తుందని ఈసీకి లేళ్ల అప్పిరెడ్డి ఈ నెల 21న ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం విచారణ జరిపి 24 గంటల్లోగా తమకు నివేదిక పంపాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌కు సీఈవో ఆదేశాలు జారీ చేశారు.