తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఝలక్. త్వరలో పశ్చిమ బెంగాల్ బారక్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్ పార్టీని వీడనున్నారు. 2019లో అర్జున్ సింగ్ టీఎంసీ నుండి బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి బరాక్‌పూర్ లోక్‌సభ సీటును దక్కించుకున్నారు. ఎన్నికల్లో గెలిచారు. అయితే 2022లో బీజేపీని వీడి మళ్లీ టీఎంసీకి వచ్చారు. ఇప్పుడు ఆయనే తిరిగి బీజేపీలో చేరనున్నారు.
అందుకు ఊతం ఇచ్చేలా టీఎంసీ అధినేత్రి దీదీ సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తుంటే బారక్‌పూర్ ఎంపీ మాత్రం స్వాగతించారు. సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్(సీఏఏ)పై కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషంగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
సీఏఏ అమలుతో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయని జోస్యం చెప్పారు. దీంతో ఆయన టీఎంసీ నుంచి బీజేపీలోకి చేరడం ఖాయమని ఆ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కమలం అనూహ్యంగా పుంజుకుంది. ఏకంగా 41 శాతం ఓటింగ్‌తో 42 స్థానాల్లో 18 స్థానాల్ని కైవసం చేసుకుంది. అధికార పార్టీ టీఎంసీ అదే ఎన్నికల్లో 42 శాతం ఓటింగ్‌తో 22 స్థానాల్లో గెలుపొందింది.
అర్జున్ సింగ్‌కు నో టికెట్
టీఎంసీ ఇటీవల మొత్తం 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కానీ బరాక్‌పూర్ నుండి అర్జున్ సింగ్‌కు టికెట్ నిరాకరించింది. పార్లమెంటరీ ఎన్నికల నుంచి తప్పుకున్న వారికి అసెంబ్లీ ఎన్నికల్లో స్థానం కల్పిస్తామని పార్టీ పేర్కొంది. అయితే, బలమైన వ్యక్తిగా పరిగణించబడుతున్న అర్జున్ సింగ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని సూచించాడు. మీరు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది కాలమే చెబుతుంది అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment