ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు
ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్సీ తలశిల రఘురామ్
అద్దంకి రూరల్/మేదరమెట్ల: గత మూడు సిద్ధం సభలకు ప్రజలు, పార్టీ శ్రేణులు లక్షలాదిగా హాజరైన నేపథ్యంలో.. ఆదివారం బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలోని పి.గుడిపాడులో జరిగే నాలుగో సిద్ధం సభకు భారీఎత్తున ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్ని లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. సభాస్థలంలో సీఎం ప్రసంగం అందరికి కనబడేటట్లుగా భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు చేరువగా వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. సభకు అంచనాలకు మించి ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారని భావిస్తున్నారు. సభ నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు సభాస్థలాన్ని, వేదికను నిశితంగా పరిశీలిస్తున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
సభకు అన్నీ సిద్ధం: తలశిల రఘురామ్
సిద్ధం సభకు అన్నీ సిద్ధం చేశామని ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ చెప్పారు. సిద్ధం సభా ప్రాంగణాన్ని ఆయన శుక్రవారం పరిశీలించారు. మొత్తం సుమారు 200 ఎకరాల్లో సిద్ధం సభ నిర్వహణ సాగుతుందని, సభకు వచ్చే వాహనాల కోసం 28 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారని చెప్పారు. సభ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
వాహనాల దారి మళ్లింపు
సిద్ధం సభ నేపథ్యంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
♦ నెల్లూరు వైపు నుంచి ఒంగోలు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్లే భారీ వాహనాలను ఒంగోలు సౌత్ బైపాస్ సంఘమిత్ర హాస్పిటల్, కర్నూలు రోడ్డు, చీమకుర్తి, పొదిలి, దొనకొండ, అడ్డరోడ్డు మీదుగా మళ్లించారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు వచ్చే భారీ వాహనాలు సంతమాగులూరు అడ్డరోడ్డు, వినుకొండ, మార్కాపురం, పొదిలి, చీమకుర్తి మీదుగా మళ్లిస్తారు. ఒంగోలు మీదుగా హైదరాబాద్‌కు వెళ్లే సాధారణ వాహనాలు మేదరమెట్ల వద్ద నుంచి నామ్ హైవేపై అద్దంకి, సంతమాగులూరు మీదుగా వెళ్లాలి.
♦ ఒంగోలు వైపు నుంచి విశాఖపట్నం వైపు 16వ నంబరు జాతీయ రహదారిపై వెళ్లే వాహనాలను త్రోవగుంట నుంచి ఎన్‌హెచ్ 216పైకి దారి మళ్లించి చీరాల, బాపట్ల, మచిలీపట్నం మీదుగా పంపుతారు.
♦ ఒంగోలు వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను త్రోవగుంట, చీరాల, బాపట్ల, పొన్నూరు మీదుగా దారి మళ్లిస్తారు. ఒంగోలు వైపు నుంచి చిలకలూరిపేట వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట, చీరాల, పర్చూరు మీదుగా వెళ్లాలి.
♦ విశాఖపట్నం నుంచి ఒంగోలు, చెన్నై వైపు వచ్చే వాహనాలను నరసాపురం, మచిలీపట్నం, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా దారి మళ్లిస్తారు. గుంటూరు నుంచి ఒంగోలు–చెన్నై వైపు వెళ్లే వాహనాలు బుడంపాడు అడ్డరోడ్డు నుంచి పొన్నూరు, బాపట్ల, చీరాల, త్రోవగుంట మీదుగా మళ్లిస్తారు.
♦ 16వ నంబర్ జాతీయ రహదారి మేదరమెట్ల గ్రోత్ సెంటర్ నుంచి బొల్లాపల్లి టోల్ ప్లాజా వరకు సిద్ధం సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అద్దంకి నుంచి నాగులపాడు, వెంకటాపురం మీదుగా జాతీయ రహదారిపై ఎటువంటి వాహనాలు అనుమతించరు.
♦ ఈ ఆంక్షలు 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అమలులోకి వస్తాయని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment