- మీ రిటైర్మెంట్ తర్వాత మీకు బీజేపీ ఏ పోస్ట్ ఆఫర్ చేసింది?
- గవర్నర్ పోస్టా.. లేక రాష్ట్రపతి పోస్టా?
- మీ కెరీర్ చివరి దశలో ఉంది.. డ్యూటీ సక్రమంగా చేయండి
- గౌరవంగా వీడ్కోలు పలకండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
- రాజీవ్ కుమార్‌పై కేజ్రీవాల్ ధ్వజం
ఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) రాజీవ్ కుమార్‌పై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్,. సీఈసీగా ఉన్న రాజీవ్ కుమార్.. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అమ్ముడుపోయారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election 2025) ప్రచారానికి నేటితో(సోమవారం)తెరపడనుంది. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్.. సీఈసీని రాజీవ్ కుమార్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కేజ్రీవాల్.. ‘ఎన్నికల కమిషన్ అనేది ఈరోజు బీజేపీకి దాసోహమైంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ను చూస్తే మనకు అదే కనబడుతుంది. అసలు ఎన్నికల కమిషన్ అనేది ఉనికిలో ఉన్నట్లు కనబడుటం లేదు. ఇది ప్రజల మనస్సుల్లో తలెత్తున్న ప్రశ్న. రాజీవ్ కుమార్ జీ.. మీరు సీఈసీగా ఉన్నారా? లేదా? మీరు సీఈసీ బాధ్యతల్ని తప్పుకోవడానికి ఈనెలే చివరిది అనుకుంటా.మీకు బీజేపీ ఏ పోస్టును ఆఫర్ చేసిందేంటి? మీ రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టును ఆఫర్ చేశారా.. లేక రాష్ట్రపతి పోస్టును ఎరగా వేశారా? అంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు.
‘రాజీవ్ కుమార్ జీ.. మీకు నాదొక విన్నపం.. నా రెండు ేచేతులు జోడించి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మీ డ్యూటీ మీరు చేయండి. సీఈసీ బాధ్యతల నుంచి ఉన్నతంగా తప్పుకోండి. అది మీకు చాలా మంచిది. మీ కెరీర్ చివరి దశలో ఉంది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అంతే కానీ దేశాన్ని నాశనం చేయకండి’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ.. ఓటర్లకు డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నా ఎన్నికల కమిషన్ మాత్రం చూస్తూ ఉండిపోవడం తప్పితే చర్యలు ఏమీ తీసుకోవడం లేదన్నారు కేజ్రీవాల్.
కాగా, ఫిబ్రవరి 5 వ తేదీ(బుధవారం) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఆప్-బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన ఆప్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. అదే సమయంలో బీజేపీ మాత్రం ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. దీనిలో భాగంగా ఆప్ ధీటుగా ప్రచారం చేసింది బీజేపీ.
Comments
Please login to add a commentAdd a comment