పార్టీల అదృష్టా‍న్ని తారుమారు చేయగలరు.. మరి ముస్లిం ఓట్లు కొల్లగొట్టేదెవరు! | UP Assembly Polls: Winning Muslim Voters Trust Biggest Challenge For BJP | Sakshi
Sakshi News home page

UP Assembly Polls: పార్టీల అదృష్టా‍న్ని తారుమారు చేయగలరు.. మరి ముస్లిం ఓట్లు కొల్లగొట్టేదెవరు!

Published Fri, Jan 21 2022 9:27 AM | Last Updated on Fri, Jan 21 2022 2:37 PM

UP Assembly Polls:  Winning Muslim Voters Trust Biggest Challenge For BJP - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో అన్ని పార్టీల రాజకీయ అదృష్టాన్ని తారుమారు చేయగల సామర్థ్యం ఉన్న ముస్లింలు ప్రస్తుత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అధికారంలోని బీజేపీని గద్దెదించాలని గట్టి పట్టుదలతో ఉన్న ఈ వర్గం తమ ప్రాబల్యం అధికంగా ఉన్న స్థానాల్లో ఏ ఇతర పార్టీలకు మద్దతిస్తుందన్నది రసకందాయంలో పడింది. ఇక ముస్లిం ఓట్లలో చీలిక, మరోవైపు హిందువుల ఓట్లను సంఘటితం చేయడం ద్వారా గత ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందిన బీజేపీ ప్రస్తుతం అదే వ్యూహాన్ని అనుసరిస్తుండగా, ముస్లిం ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే అనుకూలంగా మలుచుకునేందుకు సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముస్లింలోని మేధావివర్గం ఇదే విషయాన్ని సామాన్యుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం ఓట్ల శాతం అధికంగా ఉన్న 143 నియోజకవర్గాలపై ఆయన ప్రత్యేక ఫోకస్‌ పెట్టి ముందుకు వెళుతున్నారు.  

19 శాతం ముస్లింలు..143 సీట్లలో ప్రభావం.. 
యూపీలో 19.3 శాతంగా ఉన్న ముస్లింలు 18 జిల్లాల్లోని 143కి పైగా నియోజకవర్గాల్లో పార్టీల, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశిస్తూ వస్తున్నారు. 20–30 శాతం ముస్లిం జనాభా ఉన్న స్థానాలు 70 వరకు ఉండగా, ముఫ్పై శాతానికి పైగా ఉన్న స్థానాలు 43 వరకు ఉన్నాయి. 36 సీట్లలో అయితే ముస్లిం అభ్యర్థులు సొంతంగా గెలిచేంత సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా రాంపూర్, మొరాదాబాద్, ముజ్‌ఫర్‌నగర్, షహరాన్‌పూర్, అమ్రోహా, బిజ్నోర్, మరేలీ, సంబల్, బలరాంపూర్, బహ్రయిచ్, , హాపూర్‌ వంటి జిల్లాలో ముస్లిం జనాభా ఏకంగా 40 శాతం పైచిలుకే. వీరంతా ఎక్కువగా కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలకు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తున్నారు.

1991 ఎన్నికల నుంచి శాసనసభలో వీరి ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. 1991లో 23 మంది ముస్లిం సభ్యులు శాసనసభలో ఉంటే, 1993లో 25, 1996లో 36, 2002లో 39, 2007లో 51, 2012లో 62కి పెరిగింది. అయితే 2017 ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం, హిందుత్వ నినాదం కారణంగా కేవలం 23 మంది మాత్రమే గెలిచారు. ముస్లిం ఓట్లు చీలిపోవడం, అధికార బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని పోటీలో పెట్టకపోవడంతో వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ప్రస్తుత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ముస్లింలు తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. 1992లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా.. బాబ్రీ మసీదు కూల్చివేత జరగడంతో హస్తం పార్టీకి ముస్లింలు పూర్తిగా దూరమయ్యారు.  

ముస్లింల ప్రాతినిధ్యం తగ్గించేలా బీజేపీ ఎత్తులు
యూపీలో గత ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే ముస్లింల ప్రాతినిధ్యం పెరిగిన ప్రతిసారి బీజేపీకి ప్రతికూల ఫలితాలే వచ్చాయి. బీజేపీ తన ప్రత్యర్థి పార్టీలపై పూర్తి ఆధిక్యాన్ని కనబర్చినపుడల్లా (వివిధ సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో) ముస్లిం ప్రాతినిధ్యం తగ్గింది. 1991 అసెంబ్లీ ఎన్నికలలో, 425 మంది సభ్యుల సభలో 221 సీట్లను గెలుచుకోవడం ద్వారా యూపీలో బీజేపీ తన మొదటి మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, కేవలం 23 మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే శాసనసభకు ఎన్నికయ్యారు. ఇది మొత్తం బలంలో 5.4 శాతం మాత్రమే. అదే బీజేపీ అధికారాన్ని కోల్పోయి బలహీనంగా మారిన సంవత్సరాల్లో ముస్లిం ప్రాతినిధ్యం 17 శాతానికి  పెరిగింది. 2012లో సమాజ్‌వాదీ పార్టీ 403 సీట్లలో 224 గెలుచుకుని మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, 68 మంది ముస్లిం ఎమ్మెల్యేలు అత్యధికంగా అసెంబ్లీకి వచ్చారు.

ఆ ఏడాది బీజేపీ కేవలం 47 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అదే 2017లో బీజేపీ 312 సీట్లు  గెలిస్తే ముస్లిం ఎమ్మెలే సంఖ్య కేవలం 23 మంది మాత్రమే ఉన్నారు. గడిచిన ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొనే ప్రస్తుత ఎన్నికల్లోనూ ముస్లింల ప్రాతినిధ్యం తగ్గించేలా బీజేపీ ఎత్తులు వేస్తోంది. యూపీలో 80శాతం వర్సెస్‌ 20 శాతం ఎన్నికలు జరుగుతాయని, రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలుపుకుంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఇటీవల సున్నిత వ్యాఖ్యలు చేశారు. యోగి వ్యాఖ్యలు రాష్ట్రంలోని మెజారిటీ హిందూ, మైనారిటీ ముస్లిం జనాభా మధ్య వైరుధ్యాన్ని సృష్టించేలా ఉన్నాయని ప్రతిపక్షాలన్నీ ఆరోపించాయి. హిందూ ఓట్ల సంఘటితం కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.  

చీలకుండా ఎస్పీ జాగ్రత్తలు... 
గతంలో ఎస్పీ యాదవ్‌–ముస్లిం ఫార్మలాను వాడి అధికారాన్ని హస్తగతం చేసుకోగా, బీఎస్పీ దళితులు–ముస్లిం–బ్రాహ్మణ ఫార్ములాను వాడి సీఎం పీఠాన్ని అందుకుంది. అయితే 2012లో ఎస్పీ అధికారంలోకి వచ్చిన సమయంలో ముస్లింల ప్రాబల్యం ఉన్న 143 సీట్లలో ఎస్పీ 25.8శాతం ఓట్లతో 28 సీట్లను గెలుచుకుంది. అదే 2017 ఎన్నికలకు వచ్చేసరికి ఈ నియోజకవర్గాల్లో ఎస్పీకి ఓట్ల శాతం 29.6కు పెరిగినప్పటికీ 17 సీట్లు మాత్రమే దక్కాయి. ఈ ఎన్నికల్లో బీఎïస్పీకి  19 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 6 శాతం ఓట్లు చీలాయి. దీంతో ఎïస్పీకి కొద్దిగా నష్టం వాటిల్లింది. దీనికి తోడు హిందూ ఓట్ల ఏకీకరణ (పోలరైజేషన్‌)లో బీజేపీ విజయవంతం కావడంతో ఎస్పీకి దెబ్బపడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల్లో నష్టం జరుగకుండా యాదవ–ముస్లిం–జాట్‌–ఓబీసీ ఫార్ములాను తెరపైకి తెచ్చిన అఖిలేశ్‌ ముస్లిం ఓట్లు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లోని కీలక నేతలు సలీమ్‌ ఇక్బాల్‌ షేర్వాణీ, ఇమ్రాన్‌ మసూద్, బీఎస్పీ నుంచి సిబ్గతుల్లా అన్సారీ, కైసర్‌ జహాన్‌లను పార్టీలో చేర్చుకున్నారు. పశ్చిమ యూపీలో ఆర్‌ఎల్‌డీతో పొత్తుపెట్టుకున్నారు. తొలిదశలో 29 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే 9మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. అయితే పోటీగా బీఎస్పీ 53 సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే 13 మంది ముస్లింలకు టెకెట్లు ఇవ్వడంతో ఓటుబ్యాంకు చీలే అవకాశాలు పెరిగాయి. 

ఒవైసీ మార్క్‌
ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ వంటి లౌకిక పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మరచిపోయాయని మజ్లిస్‌ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ యూపీలో ప్రచారం చేస్తున్నారు. 2017లో ఒవైసీ 38 మంది అభ్యర్థులను పోటీలో నిలిపితే ఒక్కరూ గెలువలేకపోయారు. కానీ ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా ఎస్పీ, బీఎస్పీలకు దెబ్బకొట్టారు. ఇది పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చింది. ఈ ఎన్నికల్లో 100 మందిని నిలబెడతానని చెప్పిన ఒవైసీ ఇప్పటికే 25 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఎంఐఎం అభ్యర్థులు ఎవరి అవకాశాలను దెబ్బతీస్తారన్నది వేచిచూడాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement