హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా? | Is Balakrishna facing tough time in Hindupur Assembly Fight | Sakshi
Sakshi News home page

హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా?

Published Fri, May 31 2024 4:55 PM | Last Updated on Fri, May 31 2024 6:28 PM

Is Balakrishna facing tough time in Hindupur Assembly Fight

ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. అయితే ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు హిందూపురం ఓటర్లు గట్టిగానే గుణపాఠం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినీ హీరో బాలయ్య హిందూపురంలో ఎదురీదుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉండగా. 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్‌ దీపిక పోటీ చేయగా..ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ  అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 1985 నుంచి వరుసగా మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఒకసారి హిందూపురం నుంచే గెలిచారు.

2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మా బ్లడ్ వేరు..మా బ్రీడ్‌ వేరు అంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ అయిన కురుబ దీపిక చుక్కలు చూపించారు. నియోజకవర్గం అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లారు. తాను హిందూపురం కోడలినని.. తనకు ఓటు వేస్తే హిందూపురంలోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. తనను రెండుసార్లు అసెంబ్లీకి పంపించిన హిందూపురం ప్రజల బాగోగులను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.

తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ..హిందూపురంలో తన తరపున పీఏలను ఏర్పాటు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అందుకే ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు చర్చ జరుగుతోంది. హిందూపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలు పెద్దసంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోంది. 

దీంతో ఫలితం ఎలా ఉండబోతోందో అని సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ టెన్షన్ కు గురవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఖచ్చితంగా హిందూపురంలోనూ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.

మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఆపసోపాలు పడ్డారు. పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండి..నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీయే విశ్వసనీయత కోల్పోగా..ఆయన బావమరిదిగా బాలకృష్ణ కూడా అదే బాటులో పయనించి ప్రజలకు దూరమయ్యారు. అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగిందని చెబుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement