
సాక్షి, అమరావతి, ఒంగోలు: పార్టీ సమావేశంలో విమర్శలకు దిగిన సోమిశెట్టి సుబ్బారావు గుప్తాను కొందరు కొడుతున్నట్లు తెలిసి వెంటనే తానే ఫోన్ చేసి ఆపానని ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భౌతిక దాడులను సహించబోమని స్పష్టం చేశారు. సుబ్బారావు గుప్తాకు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. మతిస్థిమితం లేకే గుప్తా ఆ సభలో అలా మాట్లాడారని ఆయన భార్యే స్వయంగా చెబుతున్నారని మంత్రి తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ, ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లుతున్నారని మండిపడ్డారు. తన గురించి ఒంగోలు ప్రజలకు బాగా తెలుసని, దాడులు చేయడం తమ సంస్కృతి కాదని చెప్పారు. సోమవారం విజయవాడ, ఒంగోలులో మంత్రి విలేకరులతో మాట్లాడారు.
ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు..
తాను ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా ఉన్నానని, తనది ఎవరినీ ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు. తనపై రెండు సార్లు ఆర్యవైశ్యులు పోటీ చేశారని, ఎప్పుడూ వారిని ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవన్నారు. వారిని సోదరులుగానే భావించి సహాయ సహకారాలు అందించానన్నారు. టీడీపీ ఆరోపిస్తున్నట్లు తాను ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. దాడి జరిగిన విషయం తెలియగానే ఎస్పీకి ఫోన్ చేసి బాధ్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరానని చెప్పారు.
కావాలనే వివాదం..
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురించి తమ పార్టీ వారెవరూ శాసనసభలో తప్పుగా మాట్లాడలేదని, కావాలనే ఆమెను టీడీపీ వారే వివాదంలోకి లాగుతున్నారని బాలినేని తెలిపారు. లోకేష్ నేతృత్వంలో తనపై తప్పుడు ప్రచారం జరిగినప్పుడు తాను ఎంతో బాధ పడ్డానని చెప్పారు.
క్షమించండి.. అదృశ్య శక్తుల పనే: గుప్తా
తప్పుగా మాట్లాడినందుకు తనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్షమించాలని సోమిశెట్టి సుబ్బారావు గుప్తా కోరారు. మంత్రి బాలినేనితో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందని మీడియాతో పేర్కొన్నారు. తాను సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి పోస్టింగ్‌లు చేయలేదని, ఇదంతా కొన్ని అదృశ్య శక్తుల పనేనని చెప్పారు. తనపై దాడి జరిగిందన్న విషయం తెలియగానే ముందుగా బాలినేని స్పందించి తనకు అండగా నిలిచి ధైర్యం చెప్పారని వెల్లడించారు. తనపై ఎంతో అభిమానం ఉండబట్టే తనకు వీరాంజనేయస్వామి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. మంత్రి పుట్టిన రోజును పురస్కరించుకుని తాను చేసిన కొన్ని వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య విబేధాలను సృష్టించేందుకు గతంలో ఆంధ్రజ్యోతి పత్రిక కథనం రాస్తే ఆ పత్రిక కార్యాలయం వద్దే ప్రతులను దగ్థం చేశానని చెప్పారు. తల్లి, అత్త ఇటీవలే మృతి చెందడంతో తన భర్త మనోవ్యధకు గురైనట్లు గుప్తా భార్య నాగమణి తెలిపారు. జై జగన్.. జై బాలినేని అని నినదించారు.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
తొలుత ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని అభయం ఇవ్వడంతో భార్యతో కలసి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. మంత్రి వాసన్న అభయం ఇచ్చారంటే ఇక భయం లేదని అందుకే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుప్తా తెలిపారు. సుబ్బారావు ఫిర్యాదుపై వన్‌టౌన్ సీఐ సుభాషిణి 506,323, 427 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment