బుల్డోజర్‌ ప్రభుత్వం కావాలా.. భూ కబ్జాల ప్రభుత్వం కావాలా | Bandi Sanjay in Adilabad Roadshow | Sakshi
Sakshi News home page

బుల్డోజర్‌ ప్రభుత్వం కావాలా.. భూ కబ్జాల ప్రభుత్వం కావాలా

Published Tue, Nov 21 2023 4:23 AM | Last Updated on Fri, Nov 24 2023 10:24 AM

Bandi Sanjay in Adilabad Roadshow - Sakshi

కైలాస్‌నగర్‌/ వేములవాడ: ‘పేదల భూములు కబ్జా చేసి నాయకులు కోట్లకు పడగలెత్తుతుంటే నిమ్మకు నీరెత్తినట్టుండే ప్రభుత్వం కావాలా.. అలాంటి అక్రమాలపై బుల్డోజర్‌ దింపే ప్రభుత్వం కావాలా.. ప్రజలు ఆలోచించాలి’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఇతర రాష్ట్రాల్లో తాను పర్యటించినప్పుడు తాగుబోతును సీఎం ఎలా చేశారంటూ అక్కడి ప్రజలు ఇజ్జత్‌ తీస్తున్నారంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1,400 మంది యువత మరణిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లు పెట్టిందని, ఆ బిల్లు ఓటింగ్‌లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో సీఎం సీటు కోసం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్, రాజగోపాల్‌రెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే చాలామంది ఎమ్మెల్యే అభ్యర్థులకు సీఎం కేసీఆరే డబ్బులిస్తున్నారని, వారు గెలిస్తే తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరడం ఖాయమని తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే తన కొడుకు కేటీఆర్‌ను సీఎం చేస్తానంటూ కేసీఆర్‌ బహిరంగంగానే అంగీకరించారని, అలా జరిగితే కవిత, హరీశ్‌రావుకు అన్యాయం జరుగుతుందన్నారు. సంతో‹Ùరావు అన్‌హ్యాపీ రావుగా మిగులుతారని, దీంతో ఆ పార్టీ చీలడం ఖాయమని పేర్కొన్నారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిన కేసీఆర్‌కు అధికారం ఇస్తే ఉద్యోగులను రాచిరంపాన పెట్టడం ఖాయమని చెప్పారు.

పోడు భూములు, నిరుద్యోగ భృతి, భూ కబ్జాలపై ఉద్యమించిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌పై ఒక్క కేసైనా ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. నిజమైన హిందూవైతే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్‌లకు బొట్టుపెట్టి హనుమాన్‌ ఆలయానికి తీసుకొచ్చి హనుమాన్‌ చాలీసా చదివించాలని సవాల్‌ విసిరారు. 80 శాతం ఉన్న హిందువులను విస్మరించి 12 శాతం ఉన్న మైనార్టీ ఓట్ల కోసం కక్కుర్తి పడటం సిగ్గుచేటని సంజయ్‌ దుయ్యబట్టారు.

కాశీతరహాలో ఎములాడను అభివృద్ధి చేస్తాం.. 
వికాస్‌రావును గెలిపిస్తే కాశీ తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తామని బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సోమవారం ఆయన రోడ్‌షోలో మాట్లాడారు. వేములవాడను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే చెన్నమనేని వికాస్‌ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారే తప్ప.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మాదిరిగా దోచుకోవాలనే ఆలోచన లేదన్నారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వేములవాడ అభివృద్ధికి చేసిందేమి లేదని సంజయ్‌ విమర్శించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement