సర్కార్‌ దగ్గర పైసల్లేక భూముల అమ్మకం | Bandi Sanjay comments over KCR | Sakshi
Sakshi News home page

సర్కార్‌ దగ్గర పైసల్లేక భూముల అమ్మకం

Published Sat, Aug 5 2023 3:16 AM | Last Updated on Sat, Aug 5 2023 3:16 AM

Bandi Sanjay comments over KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్ర సర్కారు దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముతోందని.. మద్యం షాపుల టెండర్లను ముందుగా నిర్వహిస్తున్నదీ అందుకేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని సీఎం కేసీఆర్‌ గుర్తించారని.. అందుకే హామీల అమలు పేరిట ఎన్నికల స్టంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో రాబోయేది రామరాజ్యం, మోదీ రాజ్యమేనని పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్‌.. సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు.

ఈ సందర్భంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత విమానాశ్రయం నుంచి నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. గత తొమ్మిదేళ్లలో ఏనాడూ హామీలను పట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. 

అన్నీ ఎన్నికల స్టంట్లే..! 
‘‘ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రుణమాఫీ, వీఆర్‌ఏలు, పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధి కరణ, పీఆర్సీ అంటూ బీఆర్‌ఎస్‌ సర్కారు, కేసీఆర్‌ చేస్తున్న ప్రకటనలన్నీ ఎన్నికల డ్రామాలే. సర్కార్‌ దగ్గర పైసల్లేక ఎన్నికల తాయిలాల కోసం భూములను అమ్ముతున్నారు. సర్కారు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. పైసలే లేనప్పుడు హామీలను ఎక్కడి నుంచి నెరవేస్తారు’’ అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

కేసీఆర్‌ కుటుంబానికి మద్యం వ్యాపారం ఈజీ దందాగా మారిందని.. నవంబర్‌ దాకా గడువున్నా ముందే మద్యం టెండర్లు పిలిచి వేల కోట్లు దోచుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అమ్మేస్తూ భావితరాలను మోసం చేస్తున్నారని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ఆ సంస్థ ఆస్తులను అమ్ముకోవడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

అంతా కలసి పనిచేస్తాం 
తాము ఎన్నికల యుద్ధ రంగంలో ఉన్నామని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిదని బండి సంజయ్‌ పేర్కొన్నారు. ‘‘బీజేపీలో గ్రూపులున్నాయి, పార్టీ గ్రాఫ్‌ తగ్గిందనేది దు్రష్పచారమే. ప్రజల మనసుల్లో బీజేపీ పదిలంగా ఉంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలుంటే వాటిని భూతద్దంలో చూపడం మూర్ఖత్వం.

పేదల పక్షాన మేం చేసిన పోరాటాలు జనం మదిలో నిలిచిపోయాయి. కార్యకర్తల త్యాగాలను వృధా పోనివ్వబోం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తాం..’’ అని సంజయ్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement