మునుగోడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని త్వరలో గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తమ పార్టీకి సంబంధం లేదని శుక్రవారం యాదగిరిగుట్టలో తడిబట్టలతో సంజయ్ ప్రమాణం చేయగా, ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందుతాగి లక్ష్మీనర్సింహ్మస్వామి పేరు ఉచ్ఛరిస్తున్నందుకు సంప్రోక్షణ చేయాలన్నారు.
నాస్తికుడు దైవభక్తి గూర్చి మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నలుగురు ఎమ్మెల్యేలు తప్పుచేయకపొతే ప్రగతిభవన్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదని, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకపొతే దేవుడి వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి టీఆర్‌ఎస్ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు.
రాష్ట్రంలో రాహుల్‌గాంధీ చేస్తుంది కాంగ్రెస్ జోడోయాత్ర కాదని, అది టీఆర్‌ఎస్, కాంగ్రెస్ జోడుయాత్ర అని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలోని 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, మమ్మల్ని విమర్శించే అర్హత ఆ బానిసలకు లేదని అన్నారు. మిగిలినివారికి సైతం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 31న నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 9 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటిల్లో తమ పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు.
ఆరోపణలు నిజం కాదు: తరుణ్‌ఛుగ్
నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తోందని ఇటీవల వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అది అంతా సీఎం కేసీఆర్ ఆడిన డ్రామా అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కోనుగోళ్ల విషయంలో ఎలాంటి సంబంధం లేకపోతే బండి సంజయ్ సవాల్ మేరకు ఎందుకు యాదగిరిగుట్టలో ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు సంబంధం ఉన్నందునే ప్రమాణానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌కు దమ్ముంటే గత 8 ఏళ్ల కాలంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యాడో కేసీఆర్‌కు సైతం అదే గతి పడుతుందన్నారు. మునుగోడు ఎన్నిక కేసీఆర్ అహంకారం వల్లే వచ్చిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు గంగిడి మనోహర్‌రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment