కబ్జా భూములపై బుల్డోజర్లు దించుతా.. | Bandi Sanjay Kumar comments over brs | Sakshi
Sakshi News home page

 కబ్జా భూములపై బుల్డోజర్లు దించుతా..

Published Fri, Nov 24 2023 3:55 AM | Last Updated on Fri, Nov 24 2023 10:45 AM

Bandi Sanjay Kumar comments over brs - Sakshi

కరీంనగర్‌ టౌన్‌/ కరీంనగర్‌ రూరల్‌: ‘ప్రభుత్వ స్థలాలేమైనా మీ అయ్య జాగీరనుకున్నరా? నేనెవ్వరికీ భయపడ. బరాబర్‌ చెబుతున్నా. బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్డోజర్లు దించుతా.. వాటిని స్వాదీనపర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతా’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ ప్రకటించారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్‌ మండలంలోని తాహెర్‌కొండాపూర్, బహుదూర్‌ఖాన్‌పేట, నగునూరు గ్రామాలతోపాటు కరీంనగర్‌ 17, 38, 39వ డివిజన్లలో సంజయ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

స్థానికులు ఆయనకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి నగునూరు, విద్యానగర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించింది. తెలంగాణకు 2.40 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. వాటిని కట్టిస్తే మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ, కేసీఆర్‌ ఇంతవరకూ ఒక్క ఇల్లు కూడా పేదలకు పంచలేదు. ఆ నిధులు దారి మళ్లించిండు. నగునూరులోని దుర్గామాత గుడి సమీపంలో 669 సర్వే నంబర్‌లో 26 ఎకరాలను బీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేశారు.

ఆ భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తే బాగుండేది కదా.. నేను గెలిచాక కబ్జాకోరులపై బుల్డోజర్లు దించుతా.. ఆ భూములన్నీ పేదలకు పంచుతా’అని పేర్కొన్నారు. ‘కరీంనగర్‌లో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల చరిత్రను పరిశీలించండి.. ఎవరు ప్రజల కోసం పోరా డుతున్నారో, ఎవరు భూకబ్జాలకు పాల్పడుతున్నా రో బేరీజు వేయండి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలిద్దరూ భూకబ్జాదారులే.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కలిసి కుట్రలు చే స్తున్నాయి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లేస్తే అవన్నీ డ్రైనేజీలో వేసినట్లే.. దయచేసి కాంగ్రెస్‌ ట్రాప్‌లో పడొద్దని కోరుతున్నా.. నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు కలిసి కుట్ర చేస్తున్నారు. నేను సవాల్‌ చేస్తున్నా.. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. నిరూపిస్తే ఉరేసుకుంటా.. లేకపోతే మీరు ఏ శిక్షకైనా సిద్ధమా?’అంటూ సవాల్‌ విసిరారు.  

బియ్యం గోల్‌మాల్‌ నిరూపించేందుకు సిద్ధం! 
మంత్రి గంగుల కమలాకర్‌ బియ్యం టెండర్లలో రూ.1,300 కోట్ల గోల్‌మాల్‌ చేశారని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సవాల్‌ చేశారు. ఆయన తప్పు చేయకుంటే దేవుని గుడిలో ప్రమాణం చేయాలన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోతే ఎకరానికి రూ.10 వేలిస్తానన్న కేసీఆర్‌ ఇక్కడ ఇవ్వకుండా పంజాబ్‌ రైతులకు ఇచ్చా రని బండి మండిపడ్డారు. తనకు సంబంధించిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లను కమలాకర్‌ తీసుకొస్తే ప్రజలకు రాసిస్తానని, ఆయన అక్రమ ఆస్తులను ప్రజలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement