సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్‌ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు.
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment