
తన కార్యాలయంలోనే దీక్షకు దిగిన సంజయ్
కరీంనగర్ టౌన్: దుబ్బాక ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెలంగాణ ప్రభుత్వం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ రాచరిక, నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు సిద్దిపేట సంఘటనే నిదర్శనమన్నారు. ఫాంహౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం లాగానే మంత్రులు సైతం బరితెగించి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిచేందుకు కార్యకర్త కారులో డబ్బుపెట్టి రికవరీ అంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని, సిద్దిపేటలో బీజేపీ అభ్యర్థి ఇంట్లో తనిఖీలకు వెళ్లిన పోలీసులు మహిళలు, చిన్నపిల్లల పట్ల సంస్కారహీనంగా వ్యవహరించారని ఆరోపించారు.
దుబ్బాక ఎన్నికలకు సిద్దిపేటకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సిద్దిపేటకు వెళ్తున్న తన కారును అడ్డగించి అరెస్ట్ చేసే సమయంలో గొంతు పట్టి కారులో పడేశారని తెలిపారు. ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటే.. ప్రభుత్వం మాత్రం శాంతిభద్రతల సమస్య సృష్టించాలని చూస్తోందని పేర్కొన్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎలక్షన్ కమిషన్ ఉందో లేదో కూడా తెలియడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధం గా ఎన్నికలు నిర్వహించకుంటే ఫాంహౌస్, ప్రగతిభవన్‌పై సైతం దాడి చేస్తామని హెచ్చరించారు. సీపీని సస్పెండ్ చేయాలనే డిమాండ్‌తో ఎంపీ కార్యాలయంలోనే సంజయ్ నిరాహారదీక్షకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment