బంజరతండా వద్ద సంజయ్‌కి గుమ్మడికాయతో దిష్టి తీస్తున్న దృశ్యం
సాక్షి, కామారెడ్డి: ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంటే కృతజ్ఞతలు చెప్పాల్సిందిపోయి, తప్పుడు లెక్కలతో అబద్ధపు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గడచిన ఏడేళ్ల కాలంలో తెలంగాణకు రూ.2,52,908 కోట్లు ఇచి్చందని, కానీ మంత్రి కేటీఆర్ రూ.1.46 లక్షల కోట్లు మాత్రమే ఇచి్చందని ప్రచారం చేస్తూ ప్రజల్లో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా గురువారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బంజరతండా వద్ద బండి సంజయ్ విలేకరులతో మాట్లాడారు. కేంద్రం రాష్ట్రానికి రూ.1,04,717 కోట్లు పన్నుల వాటా ఇస్తోందని, వివిధ సంక్షేమ పథకాల కోసం రూ.లక్షా 22 వేల కోట్లు ఇచి్చందని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.40 వేల కోట్లు మంజూరు చేసి, ఇప్పటివరకు రూ.21 వేల కోట్లు విడుదల చేసిందని, రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టుల కోసం రూ. 23,491 కోట్లు కేటాయించిందన్నారు. ఏ జాతీయ విపత్తు వచ్చినా కేంద్రమే ఆదుకుంటోందని, అందులో భాగంగా ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేస్తున్నారని పేర్కొన్నారు. ఇవన్నీ కలిపితే రూ.2,52,908 కోట్లు అవుతుందన్నారు. మరెన్నో పథకాల ద్వారా నిధులు ఇస్తూనే ఉన్నామని, ఈ లెక్కలు చూపిస్తే సీఎం, మంత్రులంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment