గ్యారంటీలు, రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే..
ఇందులో భాగంగానే బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనమవుతుందని దుష్ప్రచారం
బీజేపీ సభ్యత్వ నమోదు వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్
లింగోజిగూడ: ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్‌తో కలిసి డ్రామాకు తెరలేపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీ లో బీఆర్‌ఎస్ విలీనమవుతుందని దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. సెప్టెంబర్ 3 నుంచి చేపట్టనున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లా అర్బన్ సభ్యత్వ శిక్షణా తరగతులను శుక్రవారం నాగోల్‌లోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కవిత తరఫున వాదించి ఆమెకు బెయిల్ ఇప్పించింది కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీయేనని అందరికీ తెలుసన్నారు. అందుకే తెలంగాణ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీ పదవికి పోటీ చేస్తే 38 ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్ కనీసం నామినేషన్ కూడా వేయ లేదని పేర్కొన్నారు. త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ విలీనం ఖాయమన్నారు.
2019లో నార్త్ బ్లాక్‌లోకి వెళ్లలేకపోయా.. ఇప్పుడు అక్కడే పనిచేస్తున్నా
బీజేపీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రాధాన్యం, గుర్తింపు ఉంటుందని బండి సంజయ్ అన్నారు. 2019లో నార్త్ బ్లాక్‌లోకి వెళ్లలేక బయటి నుంచే సెల్ఫీ తీసుకున్న తాను... ఇప్పుడు అదే నార్త్ బ్లాక్‌లో కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నానని చెప్పారు. 2028 రాష్ట్రంలో బీజీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, కొత్త రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment