సాక్షి, ఖమ్మం : తెలంగాణ పోలీసులపై బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించారు. వారు నిజంగా హీరోలే అని, 15 నిమిషాల పాటు పాతబస్తీని వారికి అప్పగిస్తే అంతా జల్లెడ పడతారని అన్నారు. ఓల్డ్ సిటీలోని రొహింగ్యాలు, పాకిస్తానిలను బయటకు తీస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే వారికి 15 నిమిషాల పాటు సమయం ఇచ్చి పాతబస్తీని అప్పగించాలని కోరారు. గురువారం ఖమ్మంలో బండి సంజయ్ పర్యటించారు. దీనిలో భాగంగా పలువురు నేతలు బీజేపీకిలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సంజయ్ ప్రసంగించారు. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట కార్పొరేషన్ చాలామంది నాయకులు బీజేపీ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు.
ఆదరబాదరాగా ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం మేయర్ ఎన్నికను ఎందుకు చేపట్టడంలేదని ప్రశ్నించారు. తమ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లకు టీఆర్‌ఎస్ నేతలు ఫోన్స్ చేసి రూ.5కోట్లు ఇస్తామని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఖమ్మం, వరంగల్‌లోనూ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసి గెలవాలనుకుంటున్నారని మండిపడ్డారు. కొత్తగుడం జిల్లా లక్ష్మీ దేవి మండలంలో ఐదుగురు మైనర్ బాలికలపై ప్రధాన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సంజయ్ ఘాటుగా స్పందించారు. ఈ ఘటన బయటకు రాకుండా టిఆర్ఎస్ నేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికయినా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మా కార్పొరేటర్లను మభ్యపెడుతున్నారు: బండి సంజయ్
Published Thu, Dec 24 2020 4:22 PM | Last Updated on Thu, Dec 24 2020 8:29 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment