కేటీఆర్‌ను కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరి కనీసం నెల రోజులు తిరగకమునుపే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి సొంత పార్టీ బీఆర్‌ఎస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం కృష్ణమోహన్‌రెడ్డి లాబీలోని బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయిన కృష్ణమోహన్‌రెడ్డి తాను పారీ్టలో కొనసాగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్‌రెడ్డి తదితరులు కృష్ణమోహన్‌రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు.
తాను త్వరలో పార్టీ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని ఆయన వెల్లడించారు. జూలై 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్‌రావు కూడా మంగళవారం బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బీఆర్‌ఎస్‌లో తిరిగి చేరే అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
‘బీఆర్‌ఎస్‌లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారు. నా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. అనేక మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల చాంబర్లలోకి వెళ్లి కలుస్తున్నారు. వారంతా పార్టీ మారేవారేనా?’ అని వెంకటరావు మీడియాతో అన్నారు. తాను టీ తాగేందుకు బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయానికి వచి్చనట్లు స్పష్టం చేశారు. అయితే, బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే రోజు పార్టీ శాసనసభాపక్షం కార్యాలయానికి రావడంతో ఒక్కసారి గా రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కృష్ణమోహన్‌రెడ్డి బాటలో తిరిగి సొంత గూటికి చేరుకుంటారని సమాచారం. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ (జగిత్యాల), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), కాలే యాదయ్య (చేవెళ్ల) తిరిగి అదే పార్టీలో చేరతారని సమాచారం. అయితే తాను కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని కాలే యాదయ్య ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి
పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఓ వైపు బీఆర్‌ఎస్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు కోసం దాఖలైన కేసులో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడగా, సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు మేరకు తమపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో బీఆర్‌ఎస్ నుంచి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలున్నారు.
మొత్తం 38 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు గాను కనీసం 26 మంది కాంగ్రెస్‌లో చేరితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అధికార పక్షంలో విలీనమవుతుంది. అయితే ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం విలీనానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది. తమపై అనర్హత వేటు పడితే జరిగే ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వారున్నారు.
ఇదిలాఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ స్థానిక శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పారీ్టలో చేరిక సందర్భంగా ఇచి్చన హామీలు అమలు కావడం లేదని, పారీ్టలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్‌ఎస్ గూటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment