సాక్షి, హైదరాబాద్: అటు రాహుల్‌గాంధీ పాదయాత్ర, ఇటు మునుగోడు ఉప ఎన్నిక.. రెండూ ఒకేసారి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగే సమయంలోనే ఉప ఎన్నిక జరగనుండటం ఆ పార్టీ నేతలకు సవాల్‌గా మారనుంది. ఈ రెండింటి ఫలితాలు, పరిణామాలు భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌పై కీలక ప్రభావం చూపించే అవకాశముందని నేతలు చెబుతున్నారు. యాత్రను విజయవంతంగా నిర్వహించడం, మునుగోడులో గెలవడం ద్వారా పట్టు పెంచుకోవాలని భావిస్తున్నారు.
కీలక తరుణంలో..
అక్టోబర్ చివర్లో రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం మునుగోడులో అప్పటికి నామినేషన్ల ఘట్టం పూర్తయి.. ప్రచారం ఉధృత స్థాయికి చేరుతుంది. రాహుల్ తెలంగాణలో ఉన్నప్పుడే పోలింగ్‌తోపాటు ఉప ఎన్నిక ఫలితం కూడా రానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ యాత్ర ప్రభావం ఉప ఎన్నికపై ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉప ఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్న ప్రచారానికితోడుగా రాహుల్ యాత్రకు జనంలో వచ్చే స్పందన, ప్రచారం కూడా కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
రెండూ అంటే అగ్ని పరీక్షే!
మరోవైపు రాజకీయ కోణంలోనే రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ఉన్నప్పుడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చారని.. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకే నవంబర్ 3న ఎన్నికలు నిర్వహిస్తున్నారని కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ తెలంగాణలో ఉన్న సమయంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ప్రతికూలంగా వస్తే ఆ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంమీద మునుగోడు బైపోల్ కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారనుందని అంటున్నారు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుని విజయవంతంగా పూర్తి చేస్తామన్న ధీమా కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.
మునుగోడుపై సమావేశం
మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించనుంది. మంగళవారం ఉదయం 10 గంటలకు గాంధీభవన్‌లో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌లతోపాటు మునుగోడు నియోజకవర్గంలోని మండలాల ఇన్‌చార్జులు హాజరై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment