సాక్షి రంగారెడ్డి జిల్లా: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు.. నిలదీస్తే నిర్బంధాలు అమలు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాజధాని నడిబొ డ్డున భయంకరమైన రాజ్యహింసను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మీర్‌పేట, బడంగ్‌పేట మీదుగా ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర కొనసాగింది.
బడంగ్‌పేట్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ.. కోరి తెచ్చుకున్న తెలంగాణలో నిశ్శబ్దంగా రాజ్యహింస అమలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ విషయమై మేధావులు గొంతెత్తాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు భూములు పంపిణీ చేస్తే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని లాక్కొంటోందని ఆరోపించారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను లాక్కునే హక్కు ఈ ప్రభుత్వానికి లేదన్నారు.
సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ పారీ్టలు నోరు మెదపకపోవడం బాధాకరమని చెప్పారు. ఒక్క ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 5 లక్షల కోట్ల విలువైన 10 వేల ఎకరాలను, హైదరాబాద్ చుట్టూ 25 లక్షల కోట్ల విలువైన పేదల భూములను ఈ ప్రభుత్వం లాక్కుందని ఆరోపించారు. కందుకూరు మండలంలో ఫార్మాసిటీ కంపెనీ పేరుతో ఐదొందల ఎకరాలు, మరో నాలుగు వందల ఎకరాలు బఫర్ జోన్‌లో ఈ ప్రభుత్వం తన వద్ద ఉంచుకుందన్నారు.
‘మేము అధికారంలోకి వచ్చాక బలవంతంగా లాక్కున్న భూముల్లో లబ్ధిదారులతో దున్నిస్తాం. ఇంటి స్థలాలను పంపిణీ చేస్తాం. కట్టిన ఇళ్లు పంపిణీ చేయకుండా ఉంటే గృహప్రవేశం చేయిస్తాం’అని భట్టి చెప్పారు.
భూములను కొల్లగొట్టడానికే ధరణి: గద్దర్
పేదల భూములను కొల్లగొట్టడానికే సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తెచ్చారని ప్రజా గాయకుడు గద్దర్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో కట్టింది కూలగొట్టు, కమీషన్లు కొట్టు, ఎన్నికల్లో పంచు, గద్దెనెక్కు అన్న చందంగా నడుస్తోందని వ్యంగ్యా్రస్తాలు సంధించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రశ్నించేవారు లేరని, ఇది ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment