సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏదైనా మనస్తాపానికి గురై ఉంటే అన్ని విషయాలు మాట్లాడతాం. సాధ్యమైనంత వరకు పార్టీలోనే ఉండేలా చూస్తాం. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆయన సేవల్ని వాడుకోవాలని మేం అనుకున్నాం. ఆయనకు కాంగ్రెస్ పార్టీ, అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే గౌరవం ఉంది’ అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. బుధవారం సాయంత్రం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై కీలక సమావేశం జరిగింది.
పార్టీ తాజా పరిణామాలపై సమాలోచనలు జరిపిన అనంతరం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డితో మూడు గంటలపాటు మాట్లాడానని, ఇప్పటికీ ఆయనకు ఏదైనా ఇబ్బందుంటే మాట్లాడి పార్టీలోనే కొనసాగేలా చేయాలని సమావేశంలో నిర్ణయించామని భట్టి చెప్పారు. సీఎల్పీ నాయకుడిగా తనకు పార్టీ ఎమ్మెల్యేపై నమ్మకం ఉందన్నారు. పార్టీకి వ్యతిరేకంగా రాజగోపాల్‌రెడ్డి చేసిన కామెంట్స్‌పై పార్టీలోని కీలక నేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడగా, వారికి ఆయన వివరణ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు పార్లమెంట్‌లోనూ, మరోచోట ఇతర పార్టీల వారిని యాథృచ్ఛికంగా కలిసినంత మాత్రాన దాన్ని భూతద్దంలో చూడాల్సిన పనిలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాజకీయాల కంటే, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని వెల్లడించారు.
బండి సంజయ్ ఉన్మాది..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ఉన్మాది అని, ఆయనకు రాజకీయ పరిజ్ఞానం ఉందనుకోవట్లేదని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరుతున్నారని బండి సంజయ్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకులు చేసే వ్యాఖ్యలపై దృష్టిపెట్టి సమయాన్ని వృథా చేసుకోబోదని, రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపైనే తమ దృష్టి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment