సాక్షి, హైదరాబాద్: తక్కువ బడ్జెట్ మొత్తాలతో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో ఎన్నో ఆస్తులు సాధించి పెడితే, లక్షల కోట్ల బడ్జెట్‌లు పెట్టి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా రాష్ట్రాన్ని దివాలా తీయించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రోజువారీ వ్యాపారం చేసే చిరువ్యాపారులు ఏ రోజుకారోజు అప్పు తెచ్చి రోజులు గడిపినట్టు, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రోజువారీ కార్యకలాపాలకు రిజర్వ్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) తెచ్చి నడిపే దుస్థితికి రాష్ట్రాన్ని చేర్చిందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులను కడితే, కేసీఆర్ ప్రభుత్వం కట్టకకట్టక కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకం పనులతో ఎందుకూ పనికి రాకుండా పోయిందని ధ్వజమెత్తారు. పాలమూరు–రంగారెడ్డి పథకం పూర్తి చేయలేకపోయిందని, కానీ గొప్ప ప్రాజెక్టులు పూర్తి చేసినట్టు జనాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల సందర్భంగా జరిగిన లఘు చర్చకు భట్టి జవాబిచ్చారు.
అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు
‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత ప్రభుత్వం దారుణంగా మార్చింది. అప్పులు తీర్చేందుకు కొత్త అప్పులు చేసే దుస్థితికి తెచ్చింది. ప్రభుత్వ రుణ భారం 34 శాతానికి పెరిగింది. ఈ భారాన్ని ఎవరు మోయాలి? ఆస్తులు సృష్టించామని చెప్తున్నారు. మరి ఆదాయం ఎందుకు రావటం లేదు? జీతాలు కూడా ఎందుకు సకాలంలో ఇవ్వలేకపోయారు? ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అందుకే శ్వేతపత్రం విడుదల చేశాం..’ అని చెప్పారు.
ఎలా చేసినా ప్రభుత్వ అప్పులే
‘బహిరంగ మార్కెట్‌లో కంటే అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారు. హరీశ్‌రావుకు అన్నీ తెలుసు. ఇంతకాలం స్వేచ్ఛ లేనందున మాట్లాడలేదు. ఇప్పుడైనా వాస్తవాలను అంగీకరించి మా వాదనతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నా. తెలంగాణ వచ్చాక మేం పాలనలో ఉండి ఉంటే భూతల స్వర్గం చేసేవాళ్లం. కానీ వీళ్లు అప్పుల కుప్ప చేశారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో ప్రభుత్వం నేరుగా రుణాలు తెచ్చినా, కార్పొరేషన్లు, ఇతర సంస్థలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పూచీకత్తుతో, పూచీకత్తు లేకుండా అప్పులు తెచ్చినా.. చివరకు భారం పడేది ప్రభుత్వంపైనే. ఆ అప్పులన్నీ ప్రభుత్వ అప్పులే. ఇలా 2014 నుంచి 2023 వరకు చేసిన మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లు. ప్రతి కుటుంబం నెత్తిపై రూ.7 కోట్ల అప్పు తీసుకున్నారు..’ అని భట్టి ధ్వజమెత్తారు.
ఆదాయం పెరిగితే ఓడీ ఎందుకు?
‘రాష్ట్ర ఆదాయం, జీఎస్డీపీ బాగా పెరిగితే ఓడీ ఎందుకు తీసుకున్నారు? ఓడీ అంటే ఏమిటి? రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తింటాయని లోతుగా చెప్పట్లేదు. ఓడీ అంటే దివాలా తీయడం. బ్యాంక్‌రప్ట్ కావడం. రాష్ట్రాన్ని మొత్తం ఖతం చేసి ఓడీ తీసుకోబోమనే మాట ఇవ్వమంటే ఎలా? అయితే మీలాగా మాత్రం మేం చేయం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టాలు ఎక్కిస్తాం. ఆర్థిక క్రమశిక్షణతో సంపదను సృష్టించి అభివృద్ధి పనులు చేపడతాం..’ అని స్పష్టం చేశారు.
మేం మీలా చేస్తామని ఎలా అనుకున్నారు?
‘తెలంగాణ అధికారులపై నమ్మకం లేక ఆంధ్రా ప్రాంత అధికారులతో శ్వేతపత్రం రూపొందించా రని బీఆర్‌ఎస్ సభ్యులు అనటం వింతగా ఉంది. మాకు తెలంగాణ ప్రజలు, అధికారులపై నమ్మకముంది. గత ప్రభుత్వం పదేళ్ల పాటు పని చేయించుకున్న అధికారులతోనే శ్వేతపత్రం తయారు చేయించాం. కానీ మీకు తెలంగాణ అధికారులపై నమ్మకం లేకనే కదా.. ఏపీ కేడర్ అధికారులను పిలిపించుకుని సీఎస్‌గా, డీజీపీగా నియమించుకుంది. మేము కూడా మీలాగే చేస్తామని ఎలా అనుకున్నారు?’ అంటూ భట్టి ఎద్దేవా చేశారు.
జనం ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు..
‘మేం ప్రతిపక్షాలను ప్రత్యర్థులుగానే చూస్తాం తప్ప శత్రువుగా చూడం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు తెలపాలన్నదే మా ఉద్దేశం తప్ప ఎవరినో ఇబ్బంది పెట్టాలని కాదు. అన్ని విషయాలు చెప్తే రాష్ట్ర పరపతిపై ప్రభావం పడుతుందని చెప్పటం లేదు. ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం. మోయలేని అప్పు భారం ఉన్నా, జనం ఆకాంక్షలను నెరవేర్చేలా ముందుకు సాగుతాం..’ అని పేర్కొన్నారు.
నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదు
శాసనసభ లేనప్పుడు ఎవరైనా ప్రజావాణికి రావ చ్చని, తమ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని భట్టి చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఆరు గ్యారెంటీల్లో చెప్పలేదని, ఉద్యోగాలిస్తామని చెప్పా మన్నారు.
కాళేశ్వరంను పనికిరాకుండా చేశారు
‘కాళేశ్వరం పేరుతో రూ.97 వేల కోట్లు దుర్వినియోగమయ్యాయి. ఆ ప్రాజెక్టును గొప్పగా చూపి పనికిరాకుండా చేశారు. గొప్పలకు పో యిన ప్రాజెక్టు మిషన్ భగీరథ. ఈ ప్రాజెక్టు వచ్చిన తర్వాతనే ఊరి జనం మంచి నీళ్లు తాగారు అన్నట్టు చెప్పుకొన్నారు. కానీ నా పాదయాత్రలోనే దాని అసలు డొల్లతనం స్పష్టమైంది. చాలా ప్రాంతాల్లో జనం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తవ్వించిన మంచినీటి బావుల నుంచే నీళ్లు తోడుకుని తాగుతున్నారు. అందుకే ఈ పథకంపై విచారణ జరపాలని కోరుకుంటున్నా..’ అని డిప్యూటీ సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment