సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 750 గ్రామాల్లో 109 రోజుల పాటు 1,360 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క త్వరలోనే మరో రాష్ట్ర వ్యాప్త యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందన్న బీఆర్‌ఎస్, బీజేపీ ప్రశ్నలకు సమాధానమిచ్చే విధంగా ‘సెల్ఫీ విత్ జలయజ్ఞం’ పేరుతో ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను సందర్శించే కార్యక్రమం చేపడతారని గాంధీభవన్ వర్గాల సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ఇందిరాసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల మీదుగా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల వరకు దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. ఈనెల 25 తర్వాత భట్టి ఈ యాత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది.
క్షేత్రస్థాయిలో వాస్తవాల కోసమే..
ఈ ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టి పూర్తి చేసిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైనా తెలంగాణ ఏర్పాటయిన తర్వాత బీఆర్‌ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టుల వద్దకు భట్టి వెళ్లనున్నారు. సదరు ప్రాజెక్టును ఎప్పుడు ప్రారంభించారు? ఎంత ఖర్చుతో పూర్తి చేశారు? ఎన్ని ఎకరాల ఆయకట్టు లభించింది? ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరింది? అనే అంశాలను ప్రజలకు వివరించనున్నారు.
స్థానిక నేతలతో కలిసి ప్రాజెక్టుల వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టుల పట్ల వహించిన నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడంతో పాటు వాస్త వంగా బీఆర్‌ఎస్ హయాంలో వచ్చిన కొత్త ఆయ కట్టు లెక్కను నిగ్గు తేల్చడమే ఎజెండాగా ఈ కార్య క్రమం చేపడుతున్నట్టు గాంధీభవన్ వర్గాలు తెలి పాయి. కాగా తన పాదయాత్ర విశేషాలను, అనుభ వాలను వివరించేందుకు గాను శనివారం భట్టి గాంధీభవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాదయాత్రలో తనకు ఎదురైన అనుభవాలను, రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించనున్నట్టు భట్టి ‘సాక్షి’కి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment