కొంత కాలం క్రితం వరకు బీహార్‌లోని కరకాట్ లోక్‌సభ నియోజకవర్గం ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎన్డీఏ తరపున సీనియర్ నేత ఉపేంద్ర కుష్వాహా పోటీలో ఉన్నారు. కూటమి ఒప్పందంలో భాగంగా కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చాకు ఒక సీటు లభించింది. ఆయనకు ప్రత్యర్థిగా సీపీఐ(ఎంఎల్)కు చెందిన రాజారామ్ సింగ్ రంగంలోకి దిగారు. అయితే ఇప్పుడు భోజ్‌పురి పవర్ స్టార్‌గా పేరొందిన నటుడు పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి, ఎన్డీఏకు చుక్కలు చూపిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే బీజేపీ గతంలో పవన్‌సింగ్‌కు అసన్‌సోల్ లోక్‌సభ టిక్కెట్ కేటాయించింది. అయితే తనకు అసన్‌సోల్ వద్దని, తాను కరకాట్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బీజేపీకి స్పష్టం చేశారు. కానీ అప్పటికే బీజేపీ ఆ సీటు టిక్కెట్‌ను ఉపేంద్ర కుష్వాహాకు కేటాయించింది. దీంతో భోజ్‌పురి పవర్ స్టార్ పవన్ సింగ్ బీజేపీపై దండెత్తి, కరకాట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఇది ఎన్డీఏకు పెద్ద సవాల్‌గా మారింది.
16 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న కరకాట్ ప్రాంతం వరి సాగుకు ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 400 రైస్ మిల్లులు ఉన్నాయి. పవన్ సింగ్ రాకతో కరకాట్ రాజకీయ వాతావరణం వేడెక్కిందని స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కరకాట్ 2009లో ఉనికిలోకి వచ్చింది. ఇక్కడి మొదటి ఎంపీ జేడీయూకి చెందిన మహాబలి సింగ్. 2014లో ఎన్‌డీఎ భాగస్వామ్య ఆర్‌ఎల్‌ఎస్‌పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహ విజయం సాధించారు. 2019లో మహాకూటమి నుంచి పోటీ చేసిన ఉపేంద్ర కుష్వాహాను జేడీయూకు చెందిన మహాబలి సింగ్ ఓడించారు.
పవన్ సింగ్ రాజ్‌పుత్ వర్గానికి చెందినవాడు కావడమే అతనికున్న బలం. ఇది కుష్వాహా వర్గపు ఆధిపత్య సీటు అయినప్పటికీ, ఇక్కడ కుష్వాహా, రాజ్‌పుత్, యాదవ వర్గాలకు చెందిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ఇక్కడ లక్షన్నర మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment