దేశమంతా చక్రం తిప్పుతున్న కమలం పార్టీ దక్షిణాదిన పాగా వేయలేకపోతోంది. తెలంగాణలో అధికారం వస్తుందన్న దశ నుంచి తిరోగమించింది. కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పుంజుకోవాలని ఆశిస్తోంది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కాషాయసేన. మోదీ పేరు చెప్పుకుని తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తోంది. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇంతకీ తెలంగాణ బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలు ఏంటి?..
తెలంగాణలో బలం పెంచుకోవడానికి కమలం పార్టీ హైకమాండ్ పెద్ద స్కెచ్చే గీస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీని మళ్లీ ఏర్పాటు చేస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో జాయినింగ్స్ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమలనాథులు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మల్కాజిగిరి, జహీరాబాద్, మెదక్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టిపోటీ నెలకొంది. కొత్తగా బీజేపీలో చేరే ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు? వాళ్లు వస్తే తమ భవిష్యత్ ఏంటీ? అనేదానిపై పార్టీలో నేతల మధ్య విస్తృత చర్చ సాగుతోంది.
తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చాలాకాలం నుంచి కలలు కంటోంది. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు కూడా రాలేదు. దానికి అనేక కారణాలున్నాయని పార్టీలోనే చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోయినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పార్లమెంటు ఎన్నికలతో పాటు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు కసరత్తు ప్రారంభించింది. బీఆర్ఎస్‌లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. స్థానిక సంస్థల్లో బలోపేతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలున్నాయని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.
బండి సంజయ్, ఈటల రాజేందర్ నేతృత్వంలో వేసిన చేరికల కమిటీ ముందు బీజేపీ హైకమాండ్ పెద్ద టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పనిచేయాలని అందుకు తగ్గట్టుగా సిద్దం కావాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే క్రింది స్థాయి నేతలను భారీగా చేర్చుకోవాలని పార్టీ స్కెచ్ వేస్తోంది. మరి బీజేపీ వైపు గులాబీ పార్టీ నేతలు ఏ మేరకు మొగ్గు చూపుతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment