పార్లమెంట్ ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ తెలంగాణలో పార్టీల మధ్య కప్ప గెంతులు పెరిగిపోయాయి. ఓ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలో చేరిపోయారు. ఆయన కొడుక్కి బీజేపీ ఎంపీ సీటు ఇచ్చేసింది. దీంతో అలిగిన బీజేపీ ముఖ్యనేత ఒకరు హస్తం గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ వచ్చినా రాకపోయినా.. బీజేపీలో ఉండేది లేదని ఆ మహిళా నేత తెగేసి చెబుతున్నారు. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ నేత ఎవరు?..
తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫోకస్ పెట్టింది. సీట్ల కేటాయింపుపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే నాగర్‌కర్నూల్ ఎస్సీ లోక్‌సభ స్దానం నుంచి పార్టీ అభ్యర్దిగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తనయుడు భరత్‌ప్రసాద్ పేరు ప్రకటించింది. నాగర్‌కర్నూల్ అభ్యర్థిని అందరికంటే ముందుగా ప్రకటించటంతో అక్కడి బీజేపీ నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఎంపీ రాములు ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయన అచ్చంపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీగా గెలిచారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని కొంతకాలంగా రాములు నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవి తన కుమారుడు భరత్‌ప్రసాద్‌కు ఇవ్వాలని రాములు కోరినా.. జిల్లాలోని కొందరు నేతల కారణంగా ఆయన కోరిక తీరలేదు.
రెండుసార్లు భరత్‌ప్రసాద్‌కు పదవి చేజారటంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాములు పార్టీకి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎంపీ రాములు తనయుడు భరత్‌ప్రసాద్ అచ్చంపేటలో విస్తృతంగా పర్యటించి గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సీటు కావాలని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం ఆయన్ను పట్టించుకోలేదు. అచ్చంపేట నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా పోస్టర్లు, కటౌట్లు వేయరాదని గువ్వల బాలరాజు హుకుం జారీ చేయటం సంచలంగా మారింది. ఇటీవల అచ్చంపేట, నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో కూడా ఎంపీ రాములు పాల్గొనలేదు. సమావేశాల గురించి తనకు సమాచారం లేదని రాములు చెప్పటం పార్టీతో ఎంపీకి ఉన్న గ్యాప్ గురించి అందరికీ తెలిసింది.
మూడు నెలలుగా రాములు పార్టీ మారుతున్నారని ప్రచారం జరిగింది. నాలుగు రోజుల క్రితమే రాములు, ఆయన తనయుడు భరత్ కమలం గూటికి చేరారు. రాములుకు వయసు మీద పడటంతో తనయుడికి సీటు కేటాయించారు. రాములుకు ఉన్న మంచిపేరుతో పాటు మోదీ చరిష్మా కలిసి వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎస్సీ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. తమ అభ్యర్థి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావటం.. మరోవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో బీజేపీ సానుకూలంగా ఉండటం నాగర్‌కర్నూల్‌లో భరత్‌కు సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. దీంతో ఈసారి ఇక్కడ బీజేపీ విజయం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతికి ఈసారి నిరాశ ఎదురైంది. పార్టీ నాయకత్వం తనకు సీటు నిరాకరించటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శృతి ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ఆమె బీజేపీని వీడుతారంటూ ప్రచారం సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్ది ఎవరో ఇంకా తెలియడంలేదు. ఇక కాంగ్రేస్ పార్టీలో సీటు కోసం మల్లురవి, సంపత్‌కుమార్ మధ్య తీవ్ర పోటీ కనిపిస్తోంది. బీఎస్పీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేస్తానని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది. మొత్తంగా నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు రక్తి కట్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment