భోపాల్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు కావడం విశేషం.
గురువారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారే. చాలా కాలంగా బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల్లో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎప్పటినుంచో కాంగ్రెస్ అభ్యర్థులు పట్టుకుపోయారు. ఈ కారణంతోనే ఈ ఎత్తుగడ వేసింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు తగిన సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతోనే చాలా ముందస్తుగా జాబితాను ప్రకటించింది బీజీపీ.
మొదటి విడత జాబితాలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ కోసం 39 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ. గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో 34 సీట్లకు గాను ఆరుగురు వెనుకబడిన కులాల అభ్యర్థులను ప్రకటించింది.
ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన 14 మంది అభ్యర్థులకు మళ్ళీ టికెట్లు ఇచ్చింది పార్టీ అధిష్టానం. వీరిలో మాజీ మంత్రులు అచల్ సోంకర్, నానాజీ మొహద్, ఓంప్రకాష్ ధుర్వే, ఐదల్ సింగ్ కంసనా, నిర్మల భూరియా, లలితా యాదవ్, లాల్ సింగ్ ఆర్య కూడా ఉన్నారు.
మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని అన్నారు.
గోహాడ్ అసెంబ్లీ సీటును జ్యోతితాదిత్య సింధియా సన్నిహితుడు రణ్ వీర్ జటావ్ ను కాదని షెడ్యూల్డ్ కులాల మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యకు టికెట్ ఇచ్చారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి లాల్ సింగ్ ఆ వర్గం వారిని ప్రభావం చేయగలరని పార్టీ అధిష్టానం ఆలోచన. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన రణ్ వీర్ జటావ్ కొద్దీ కాలానికి జోతిరాధిత్య సింధియా ఆశీస్సులతో బీజేపీ పార్టీలో చేరారు. 2020 లో జరిగిన ఉప ఎన్నికల్లో రణ్ వీర్ జటావ్ ఓటమిపాలవ్వగా బీజేపీ ఆయనను హ్యాండ్స్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించింది కానీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
బీజేపీ ప్రకటించిన జాబితాలో కొంతమంది నేరచరిత్ర ఉన్న నేతలు కూడా ఉండడం విశేషం. వారిలో భోపాల్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థి ధృవ్ నారాయణ్ సింగ్ RTI కార్యకర్త షెహ్లా మాసూద్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండ్రోజుల క్రితమే షెహ్లా మసూద్ కుటుంబసభ్యులు కేసు పునర్విచారణ జరిపించాలని సీబీఐని డిమాండ్ చేశారు.
ఇక శివపురి జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోట పిచోర్ అసెంబ్లీ సీటును ప్రీతమ్ సింగ్ లోధీకి కేటాయించింది పార్టీ అధిష్టానం. అక్కడ కాంగ్రెస్ నేత కేపీ సింగ్ కక్కజుపై ప్రీతమ్ సింగ్ లోధీ పోటీ చేయడం ఇది మూడోసారి కావడం వవిశేషం. కొద్ది రోజులక్రితం బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు లోధీని పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అయినా ఇప్పుడు ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది.
వీరితోపాటు కొంతమంది రాజకీయ వారసులు కూడా మొదటి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్నారు. సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మెహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళ రావత్, దామోహ్ మాజీ ఎంపీ శివరాజ్ సింగ్ లోధీ కుమారుడు వీరేంద్ర సింగ్ లోధి, మాజీ ఎమ్మెల్యే ప్రతిభా సింగ్ కుమారుడు నీరజ్ సింగ్ లు ఈ జాబితాలో ఉన్నారు. సాగర్ లోని బందా అసెంబ్లీ స్థానాన్ని వీరేంద్ర సింగ్ లోధీకి కేటాయించారు బీజేపీ పెద్దలు. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తర్వార్ సింగ్ లోధీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛతర్‌పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ కుమారుడు కామాఖ్య ప్రతాప్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు.
ఇది కూడా చదవండి: కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్
Comments
Please login to add a commentAdd a comment