
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీ, జనసేనలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా బద్వేలు ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి కేవలం 21,678 ఓట్లు మాత్రమే దక్కడంతో ఈ ఎన్నికల్లో నిర్విరామంగా పనిచేసిన 3 పార్టీల నేతల్లో అంతర్మథనం మొదలైంది. టీడీపీ క్యాడర్‌కు డబ్బులు పంచి తమవైపు తిప్పుకోవడంతోపాటు కేంద్ర బలగాలను దించినా బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీకి 32.36 శాతం ఓట్లు లభించగా ఈసారి జనసేన సైతం సహకరించినా బీజేపీ అభ్యర్థికి 14.73 శాతం ఓట్లు మాత్రమే దక్కడం గమనార్హం. వైఎస్సార్ సీపీ అభ్యర్థి దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్యకు గత ఎన్నికల్లో 95,482 (60.89 శాతం) ఓట్లు వచ్చాయి. అప్పుడు 1,56,819 (76 శాతం) ఓట్లు పోల్ కాగా ఈసారి 1,47,166 (68.39 శాతం) ఓట్లు పోలయ్యాయి. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 8 శాతం తగ్గినప్పటికీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 1,12,211 (76.24 శాతం) ఓట్లు లభించడం గమనార్హం.
సర్వశక్తులూ ఒడ్డినా..
బద్వేలులో బీజేపీకి నామమాత్రంగా కూడా క్యాడర్ లేదు. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తిరువీధి జయరాములు పోటీ చేయగా 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుత ఉప ఎన్నికలో బద్వేలు బరిలోకి దిగిన పణతల సురేష్ గత ఎన్నికల్లో రైల్వేకోడూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయగా 1,049 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ నేతలు ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్ పాత పరిచయాలతో టీడీపీ నేతలతో మంతనాలు జరిపి తమ అభ్యర్థికి సహకరించాలని లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు.
బీజేపీ ఏజెంట్లుగా కూర్చునేలా ఒప్పించారు. మరోవైపు కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్రస్థాయి నేతలను బద్వేలుకు తరలించి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డింది. ఎన్నికల నాటికి పోలింగ్ వ్యూహాలను టీడీపీకి అప్పగించి చేతులెత్తేసింది. 281 పోలింగ్ బూత్‌లు ఉన్న నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు కేవలం 10 కేంద్రాల్లో మాత్రమే ఏజెంట్లుగా ఉండగా మిగిలిన అన్నిచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలే ఏజెంట్లుగా ఉన్నారు. ఎంపీపీ, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచుల స్థాయి నేతలు సైతం ఏజెంట్లుగా కూర్చున్నా ప్రయోజనం దక్కలేదు.
Comments
Please login to add a commentAdd a comment