మెదక్ జిల్లా నర్సాపూర్ సభలో బీజేపీలో చేరిన మురళీయాదవ్ దంపతులను పరిచయం చేస్తున్న ఈటల
నర్సాపూర్/ చౌటుప్పల్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రజలు సీఎం కేసీఆర్ పాలనపై విరక్తితో ఉన్నారని కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్రయాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ సీఎంగా పదవి పొందిన తర్వాత.. రాష్ట్రాన్ని పక్కనపెట్టి తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఆరోపించారు. దళిత బంధు వంటి పథకాలు లబ్ధిదారులకు చేరడం లేదని.. అవి కేవలం టీవీల్లో ప్రకటనలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని భూపేంద్ర యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాష్ట్ర ప్రజలకు చేరడం లేదన్నారు.
టీఆర్‌ఎస్ పాలన నచ్చకే: బండి సంజయ్
సీఎం కేసీఆర్ అరాచక, అవినీతి పాలన నచ్చకనే టీఆర్‌ఎస్ నాయకులు బీజేపీ వైపు వస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.30 వేలకోట్ల నుంచి రూ.లక్షా 30వేల కోట్లకు పెంచి.. లక్ష కోట్లు కొట్టేశారని విమర్శించారు. సీఎం కుటుంబం దుబాయ్, అమెరికా, మస్కట్ వంటి దేశాలకు వేలకోట్ల రూపాయలు తరలించుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో పేదోళ్ల రాజ్యం కోసం బీజేపీ కృషి చేస్తోందని, అందరి భాగస్వామ్యంతో విజయం సాధిస్తామని చెప్పారు.
టీఆర్‌ఎస్ టెంట్ ఎగిరిపోతుంది
మునుగోడులో బీజేపీ గెలుస్తుందని, టీఆర్‌ఎస్ టెంట్ ఎగిరిపోవడం ఖాయమని కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పరిధిలోని లింగారెడ్డిగూడెంలో ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గొల్ల, కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భూపేంద్రయాదవ్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకోసమే తాము ఇక్కడికి వచ్చామని చెప్పారు. ప్రతి పల్లెకు అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించడమే బీజేపీ ధ్యేయమన్నారు.
ఈటల సమక్షంలో బీజేపీలోకి మురళీయాదవ్ దంపతులు
ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ జెడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఆమె భర్త నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్‌తోపాటు పరకాల మాజీ ఎమ్మెల్యే భిక్షపతి, హైదరాబాద్‌కు చెందిన శ్యామ్ సుందర్ తదితరులు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల సమక్షంలో బీజేపీలో చేరారు.
కేంద్ర మంత్రి వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు చేసే దాక తాము విశ్రమించబోమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఎంతో మంది బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని తెలిపారు. మునుగోడు గడ్డ మీద కూడా ఎగిరేది కాషాయ జెండానేనని, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మీద ఎగిరే జెండా బీజేపీ జెండానేనని చెప్పారు. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు చరమగీతం పాడితేనే తెలంగాణ గోస తీరుతుందని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment