టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం: ఈటల | TS: MLA Etela Rajender Comments On CM KCR | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ ఓటమి ఖాయం: ఈటల

Published Mon, Jul 4 2022 1:53 AM | Last Updated on Mon, Jul 4 2022 1:53 AM

TS: MLA Etela Rajender Comments On CM KCR - Sakshi

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఈటల  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌ను చిత్తుగా ఓడించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్‌ విస్మరించారని, కానీ మోదీ దళితున్ని రాష్ట్రపతి చేశారని, గిరిజన మహిళను రాష్ట్రపతి చేయబోతున్నారని అన్నారు. ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్‌ ప్రజల వద్దకు వెళ్తారని విమర్శించారు.

బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని, అందరికీ అభివృద్ధి ఫలాలు అందిస్తామని మోదీ చెప్పారన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయదుందుభి మోగించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ఫొటోలను అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ప్రయత్నించిందని.. ఆయన 135 కోట్ల ప్రజల హృదయాల్లో ఉన్న విషయాన్ని గమనించడం లేదని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్న ఈటల.. కాంగ్రెస్‌ను అంతరించిపోతున్న పార్టీగా అభివర్ణించారు. 

ప్రధానికి నివేదిక ఇచ్చా
ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, సీఎం కేసీఆర్‌ కుటుంబం అవినీతి, అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు సమగ్ర నివేదికను సమర్పించినట్లు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తెలిపారు. హెచ్‌ఐసీసీ వేదికగా రెండో రోజు ఆదివారం కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగాయి.

ఈ సమావేశాల్లో ఆయన మా ట్లాడుతూ, తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కేంద్రం అందించిన ఆర్థిక సహకారం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన సమ యంలో కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలను వివరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని మోదీకి చెప్పినట్లు వెల్లడించారు. పార్టీలో కొత్త సభ్యుడినే అయినా..తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఇందుకు అవసరమైన రోడ్‌మ్యాప్‌ను కూడా పార్టీ అధిష్టానం సిద్ధం చేసిందని చెప్పారు. కేసీఆర్‌ ముఖం చూసేందుకు కూడా ప్రజలు ఇష్టపడటం లేదన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement