
సూరత్: ఇతర పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు భయపడుతున్నందునే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చే మొత్తం విరాళాల్లో 95% బీజేపీకి అందుతున్నాయని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన సూరత్‌లో మాట్లాడారు. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే కార్పొరేట్ సంస్థలను బీజేపీ బెదిరిస్తోందని ఆయన ఆరోపించారు. ఇతర పార్టీలకు విరాళాలిచ్చే వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఆదాయ పన్ను శాఖల అధికారులు సోదాలు జరుపుతున్నారని తెలిపారు.
‘మన ప్రజాస్వామ్యంలో విరాళాలు కూడా కేవలం ఒక్క పార్టీకే వెళ్తున్నాయి. బీజేపీ భారీగా డబ్బు పోగేసుకుంటూ దేశవ్యాప్తంగా ఫైవ్ స్టార్ తరహా పార్టీ కార్యాలయాలను నిర్మించుకుంటోంది. ఆ డబ్బుతో ప్రతిపక్ష పాలిత రాష్ట్రప్రభుత్వాలను అస్థిరపరుస్తోంది. ఫాసిస్ట్ శక్తిగా మారింది. ఒక విధానం, పథకం, సిద్ధాంతం అనేది లేకుండా కేవలం మతం ప్రాతిపదికగానే బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోంది’ అని గెహ్లాట్ ఆరోపించారు.
ఆప్‌పైనా గెహ్లాట్ ఆరోపణలు గుప్పించారు. ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ డబ్బుతో మీడియాను నియంత్రిస్తున్నారని, వ్యతిరేక వార్తలు రాకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ప్రజాస్వామ్యానికి హాని చేస్తున్నారని అన్నారు.
చదవండి: గుజరాత్‌లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్..
Comments
Please login to add a commentAdd a comment