ఉత్తరప్రదేశ్‌లోని హై ప్రొఫైల్ సీట్లలో ఒకటైన రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయాన్ని అటు కాంగ్రెస్ గానీ, ఇటు బీజేపీగానీ ఇంకా వెల్లడించలేదు. అయితే ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రియాంకకు పోటీగా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్‌గాంధీని ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించింది. రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వరుణ్‌గాంధీకి బీజేపీ తాజాగా ఆఫర్ ఇచ్చిందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వరుణ్ తన సోదరి ప్రియాంకా గాంధీపై ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అడిగారని సమాచారం.
రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్యానెల్‌లో వరుణ్ గాంధీ పేరును కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం చేర్చినట్లు సమాచారం. రాయ్‌బరేలీ సీటు కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందింది. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్‌గాంధీని రంగంలోకి దించితే కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఎదురవుతుందని బీజేపీ అంతర్గత సర్వేలో వెల్లడైంది. ఈ నేపధ్యంలోనే వరుణ్ గాంధీని ఇక్కడి నుంచి పోటీచేయించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.
ఒకవేళ వరుణ్ గాంధీ రాయ్ బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తే, గాంధీ కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్నట్లవుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ అమేథీ నుంచి రాజీవ్ గాంధీపై పోటీ చేశారు. అప్పట్లో ఆమె ఓటమిని ఎదుర్కొన్నారు. ఆ తరువాత మేనకా గాంధీ, సోనియా గాంధీ కుటుంబాలు పరస్పరం ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ప్రస్తుతం యూపీలోని సుల్తాన్‌పూర్ స్థానం నుంచి మేనకా గాంధీ మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment