భువనేశ్వర్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా రాష్ట్రంలో ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. అధికార బిజూ జనతాదళ్‌తో పొత్తు లేకుండానే.. రాష్ట్రంలో స్వతహాగా పోటీ చేయనున్నట్లు బీజేపీ శుక్రవారం ప్రకటించింది. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు రాష్ట్ర పార్టీ చీఫ్ మన్మోహన్ సమాల్ వెల్లడించారు. ‘గత 10 సంవత్సరాలుగా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ జాతీయ ప్రాముఖ్యత కలిగిన అనేక విషయాలలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. ఇందుకు మేము ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానే నేడు కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలు ఒడిశాలో సామాన్యులకు చేరడం లేదు. దీని కారణంగా రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రయోజనాలను పొందడం లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశాలో బీజేడీ పొత్తు పెట్టుకోకూడదని బీజేపీ నిర్ణయించింది. ‘ఒడిశాలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోరాడబోతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో నాలుగున్నర కోట్ల ఓడిశా ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమైంది’ అని సమాల్ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా పట్నాయక్ పార్టీతో పొత్తు బీజేపీ ప్రయోజనాలకు విరుద్ధమని ఒడిశా రాష్ట్ర నేతలు ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా ఒడిశాలో లోక్‌సభ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీతో బీజేపీ పొత్తు పెట్టుకోబోతుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాత మిత్రులు ఒక్కటయ్యారని, 11 సంవత్సరాల తర్వాత బీజేడీ, బీజేపీ మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయబోతున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని 21 లోక్‌సభ స్థానాల్లో బీజేడీ 13, బీజేపీ 8 చోట్ల పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పొత్తుపై బీజేపీ తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. 11 ఏళ్ల కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్ పడింది. 2009 ఎన్నికలలో బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీచేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ బయటకు వచ్చేసింది.. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి గత పదేళ్లుగా బీజేపీ మద్దతు తెలుపుతూనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
చదవండి: అరెస్టు తర్వాత 'కేజ్రీవాల్' ఫస్ట్ రియాక్షన్ ఇదే..
ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీతో పొత్తు: బీజేపీ క్లారిటీ
Published Fri, Mar 22 2024 5:30 PM | Last Updated on Fri, Mar 22 2024 6:55 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment