భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినీ తారలతో పాటు రాజకుటుంబాలకు చెందిన ప్రముఖులకు కూడా టిక్కెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల పోరులో మనం యువరాణులను, యువరాజులను చూడబోతున్నాం. దేశంలోని ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు రాజకుటుంబాలకు చెందిన పలువురికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 12 రాజకుటుంబాల వారసులు పోటీకి దిగారు. వీరిలో ఐదుగురు తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఏడుగురు ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. కర్ణాటకలోని మైసూర్ రాజు నుంచి త్రిపుర రాజకుటుంబానికి చెందిన రాణి వరకు పలువురు అభ్యర్థులు ఈ జాబితాలో కనిపిస్తారు. మార్చి 13న బీజేపీ విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో మైసూర్ రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ వడియార్‌కు అవకాశం కల్పించింది. యదువీర్ తాత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ 1999 వరకు మైసూర్ నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
బీజేపీ తన రెండవ జాబితాలో త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానం నుండి కీర్తి సింగ్ దేవ్ వర్మకు అవకాశం కల్పించింది. ఆమె త్రిపుర మాణిక్య రాజ కుటుంబానికి చెందిన యువరాణి. ఆమె తిప్ర మోతా పార్టీ నేత ప్రద్యోత్ దేవ్ వర్మకు సోదరి. తిప్ర మోత పార్టీ ఇటీవలే ఎన్డీఏ కూటమిలో చేరి, ఇప్పుడు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తోంది. ఈ క్రమంలో వినిపించే మూడో పేరు మాళవిక కేశరి దేవ్. ఈమెను బీజేపీ ఒడిశా నుంచి బరిలోకి దింపింది. మాళవిక బీజేడీ మాజీ ఎంపీ అర్కా కేశరి దేవ్ భార్య . కలహండి రాజకుటుంబ సభ్యురాలు. 2023లో ఈ దంపతులు బీజేపీలో చేరారు.
బీజేపీ రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి మహిమా కుమారి విశ్వరాజ్ సింగ్ మేవార్‌కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈమె మేవార్ రాజకుటుంబానికి చెందిన విశ్వరాజ్ సింగ్ భార్య. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ లోక్‌సభ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మోయిత్రాపై బీజేపీ రాజమాత అమృతా రాయ్‌ను పోటీకి నిలిచింది. రాయ్ కృష్ణనగర్ రాజకుటుంబానికి చెందినవారు. ఆ ప్రాంతంలో ఆమెను రాజమాత అని పిలుస్తారు.
ఛత్రపతి శివాజీ వారసుడు, మహారాష్ట్రలోని సతారా రాజ్యసభ ఎంపి ఉదయన్‌రాజే భోసలే ఈసారి బీజేపీ టిక్కెట్‌పై సతారా లోక్‌సభ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రి, గ్వాలియర్ మహారాజు జ్యోతిరాదిత్య సింధియా ఇప్పటికే బీజేపీలో రాజ్యసభ ఎంపీగా, కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. జ్యోతిరాదిత్య సింధియా తొలిసారి గుణ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీకి దిగారు. ఒడిశాలోని పట్నాఘర్-బోలంగీర్ రాజకుటుంబానికి చెందిన బొలంగీర్ సిట్టింగ్ ఎంపీ సంగీతా కుమారి సింగ్ డియోకు బీజేపీ ఈసారి టిక్కెట్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment