ఇప్పట్లో ఏ ఎన్నికలు లేవు.. కానీ, రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధానంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గులాబీ పార్టీలో రగులుతున్న అసంతృప్త జ్వాలలతో సమీకరణాలు మారి పోతున్నాయి. కేడర్ ‘కారు’ దిగి కాషాయ జెండా పడుతుండడంతో కమలంలో జోష్ కనిపిస్తోంది. అదే ఊపుతో ఇతర అసమ్మతి నేతలకు వల విసురుతున్న బీజేపీ నాయకత్వం.. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులకు సైతం గాలం వేస్తోంది!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారతున్నాయి. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేనప్పటికీ, ఇక్కడ రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారి పోతున్నాయి. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కారు దిగి, కమలం గూటికి చేరడం చర్చనీయాంశమైంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఒకరిద్దరు బీజేపీ వైపు చూస్తుండటంతో మూడు ప్రధాన పార్టీల్లో అంతర్గత చర్చకు దారి తీస్తోంది. టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ.. ఇటు కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకత్వంపైనా దృష్టి సారించింది. రూరల్ నియోజకవర్గంలో ఎలాగైనా పట్టు సాధించాలనే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది.
పట్టు కోసం బీజేపీ ఆరాటం..
భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఇన్‌చార్జీగా ఉన్న కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన బీజేపీలో ఉన్నప్పుడు తరచూ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లగలిగారు. తీరా అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఆయన ‘కారెక్కడం’తో చేరడంతో ఇక్కడ బీజేపీకి నాయకత్వ సమస్య తలెత్తింది. చెప్పుకోదగిన నియోజకవర్గ స్థాయి నాయకులు లేకుండా పోయారు. ఇక్కడ కమల దళానికి కేడర్ ఉన్నప్పటికీ వారిని నడిపించే నేతలు లేక పోవడంతో చాలా వరకు బీజేపీ కేడర్ సైలెంట్ అయిపోయింది. (చదవండి: టీఆర్‌ఎస్‌కు షాక్.. బీజేపీలోకి గులాబీ నేతలు!)
ఇక ఇప్పుడు ఈ నియోజక వర్గంపై దృష్టి సారించిన బీజేపీ నాయకత్వం.. పట్టు సాధించేందుకు పావులు కదుపుతోంది. అధికార టీఆర్‌ఎస్‌లో రగులుతున్న అసంతృప్తులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే డిచ్‌పల్లికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరగా, మోపాల్‌తో పాటు మరో రెండు మండలాలకు చెందిన అసంతృప్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మొత్తానికి రూరల్ నియోజకవర్గంలో గట్టి పట్టు సాధించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
బీజేపీ వైపు భూపతిరెడ్డి చూపు?
మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా ఉన్న ఆయన గత కొంత కాలంగా కాంగ్రెస్‌కు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నాయకత్వ సమస్యను అధిగమించవచ్చని బీజేపీ భావిస్తోంది. పార్టీ జిల్లా ముఖ్య నాయకత్వం భూపతిరెడ్డితో మాట్లాడినట్లు సమాచారం. భూపతిరెడ్డికి నియోజకవర్గంలో గట్టి పట్టుంది. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న ఆయనకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అనుచర వర్గం ఉంది.
ఇక టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయన గత ఎమ్మెల్యే ఎన్నికల వేళ కాంగ్రెస్‌లో చేరి, పోటీ చేశారు. దీంతో ఫిరాయింపుల చట్టం కింద ఆయన ఎమ్మెల్సీ పదవి పోయింది. అప్పటి నుంచి తన వైద్య వృత్తిని కొనసాగిస్తూనే అనుచర వర్గానికి అందుబాటులో ఉంటున్నారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ఎన్నికలు లేని ఈ సమయంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment