సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్‌ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయమని తేలిపోయిందని.. అందుకే కేసీఆర్ తన పదవిని కాపాడుకొనేందుకు వేల కోట్లు ఖర్చుచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అయినా వారికి మునుగోడులో ఓటమి తప్పదని, టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టడం ఖాయమని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగిస్తున్నారన్న, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్న మాటలు పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వపరంగా, వివిధ సంస్థల ద్వారా నిర్వహించిన అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగానే ఉన్నాయన్నారు. మునుగోడు ఎన్నికల ›ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
సాక్షి: మునుగోడు ఎన్నికను ఎలా అంచనా వేస్తున్నారు?
బండి సంజయ్: తెలంగాణలోని పేద ప్రజల భవిష్యత్‌తో ముడిపడిన ఎన్నిక లివి. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ, గడీల పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కేసీఆర్ చేసిన తప్పులను, అవినీతిని అంగీకరించినట్టేనని.. మందు, డబ్బుల పంచే టీఆర్‌ఎస్ గెలిస్తే అంతకంటే అవమానం ఉండదని ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ అభివృద్ధి ప్రదాత కాదు.. ఫక్తు రాజకీయ అవకాశవాది. ఎన్నికలొస్తేనే నిధులిస్తారు, అభివృద్ధి చేస్తారనే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ప్రజలు ఇదంతా గమనించి, రాజగోపాల్‌రెడ్డిని గెలిపించుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం?
రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశాకే మునుగోడులో పలు అభివృద్ధి పనులు జరగడాన్ని ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. గతంలో నిరాహార దీక్షలు, నిరసనలు చేసినా కానిది రాజీనామా చేశాక గట్టుప్పల్ మండలం ఏర్పాటు, చౌటుప్పల్–సంస్థాన్ నారాయణపూర్ రోడ్డు, ఆసరా పింఛన్లు వంటివన్నీ వచ్చాయి. గొల్లకురుమ సోదరులకు గొర్రెల పైసలు విడుదల చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు మార్గం చూపే ఉప ఎన్నిక కాబట్టి ప్రజలంతా ఆలోచిస్తున్నారు. మునుగోడుకు సంబంధించిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదు. డిండి ప్రాజెక్టు పూర్తి కాలేదు, డిగ్రీ కాలేజీ ఇవ్వలేదు. వంద పడకల ఆస్పత్రి ఇస్తామని ఇవ్వలేదు. కిష్టాపురం, చర్లగూడెం ప్రాజెక్టులు పూర్తికాలేదు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.
ఫ్లోరోసిస్, మూసీ సమస్యలపై చర్చ జరుగుతోంది కదా!
గరళంగా మారిన మూసీ నీళ్లను తాగుతూ చస్తూ బతుకున్న మునుగోడు ప్రజలపై కనికరం లేని కేసీఆర్.. ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే మందీ మార్బలాన్ని పంపి ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నారు. మూసీ ప్రక్షాళన ఎటు పోయింది? మునుగోడును నిండా ముంచింది కేసీఆరే. ఫ్లోరోసిసేకాదు మూసీ ప్రక్షాళనపైనా మేం చర్చకు సిద్ధం
బీజేపీ గెలుపు సాధ్యమని ఎలా అనుకుంటున్నారు?
కార్యకర్తలను నమ్ముకున్న పార్టీ మాది. కొత్త, పాత తేడా లేకుండా అంతా బీజేపీ గెలుపు కోసం కసిగా పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ చరిష్మా, కేంద్రం చేపడుతున్న పథకాలు, వాటితో పేదలకు చేకూరుతున్న ప్రయోజనాలు బీజేపీని గెలిపిస్తాయి. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మద్దతును కూడగడుతున్నారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేసిన విషయాన్ని వివరిస్తున్నాం. మరోవైపు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనను, ప్రజాసమస్యలను గాలికొదిలి.. 16 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను దింపి అడ్డగోలుగా డబ్బు, మద్యం పంపిణీ చేయడాన్ని.. సర్వశక్తులు ఒడ్డి పోలింగ్ బూత్‌ల వారీగా బాధ్యతలు అప్పగించడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.
బీజేపీని, మోదీని కేసీఆర్ విమర్శిస్తున్నందునే లిక్కర్ కేసులు, ఈడీ దాడులు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మీ స్పందన?
ఇప్పుడు మునుగోడుపై గుంట నక్కల్లా పడిందెవరు? లిక్కర్ దందా చేసిందెవరు? మునుగోడులో మద్యాన్ని పారిస్తున్నదెవరు? మీ కళ్లముందే సాక్ష్యాలున్నయి. ప్రధాని మోదీ ఎలాంటి ఆరోపణలనైనా పాజిటివ్ ఆలోచనతో చూస్తారే తప్ప.. విమర్శలను తట్టుకోలేని కేసీఆర్ కుటుంబంలా చేయరు. ఏదైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పు చేయకుంటే భయపడటం ఎందుకు? తప్పు చేశారు కాబట్టే ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. గతంలో మోదీ, అమిత్‌షా ఇలా ఆరోపణలు చేయలేదు. విచారణను ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటికి వచ్చారు.
మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రజాసంగ్రామయాత్రను వాయిదా వేసుకున్నారేం?
ప్రజల కష్టాలను, సమస్యలను స్వయంగా చూడటం, బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టాం. ప్రజలు నిండుగా ఆశీర్వదించారు. మునుగోడు ఉప ఎన్నికను, ప్రజాసంగ్రామ యాత్రను వేర్వేరుగా చూడొద్దు. రెండూ కూడా టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ల నియంతృత్వ, కుటుంబ, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఎంచుకున్న క్షేత్రాలే.
మునుగోడులో తొలి నుంచీ కాంగ్రెస్, వామపక్షాలకు పట్టుంది కదా!
తమ పార్టీ కేసీఆర్ కంట్రోల్‌లో ఉందని కాంగ్రెస్ నేత స్వయంగా ఒప్పుకొన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరరనే గ్యారెంటీ లేదని ప్రజలే అనుకుంటున్నారు. టీఆర్‌ఎస్ కంట్రోల్ ఉన్న తమ పార్టీకి ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలూ భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌కు వామపక్షాల మద్దతుపై ఆ పార్టీల కేడర్ అయోమయంలో ఉంది.
కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతామని బీజేపీ నేతలు అంటున్నారు. ఎందుకు?
అన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. లిక్కర్ స్కాం, చీకోటి ప్రవీణ్ పేకాట స్కాం, డ్రగ్స్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్ నేతల పాత్ర ఉందని మేం మొదటి నుంచీ చెబుతూనే ఉన్నాం. ఈడీ, సీబీఐ విచారణలో ఆధారాలు బయటకొస్తున్నాయి. కేసీఆర్ కుటుంబ సభ్యుల బినామీలు, సన్నిహితులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. వాళ్లు తవ్వుకున్న గోతిలో వాళ్లే పడి.. పైగా బీజేపీపై ఏడిస్తే మేమేం చేస్తాం?
మునుగోడు ఫలితంతో రాష్ట్ర రాజకీయాలపై ప్రభావమేంటి?
టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. మునుగోడులో ఓడిపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోవడం ఖాయమని తేలడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా తన పదవిని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు. అయినా టీఆర్‌ఎస్ ఓటమి తప్పదని ఇప్పటికే తేలిపోయింది. దీనితో టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టడం ఖాయం. తర్వాత ఆ ప్రభుత్వం ఏ మేరకు బతికి బట్టకడుతుందనే దానిపై ఎలాంటి గ్యారెంటీ లేదు. రాష్ట్రంలో ప్రజలు కూడా ముందస్తు ఎన్నికలను కోరుకుంటున్నారు. కేసీఆర్ పాలన ఇంకా సాగితే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో మునిగి శ్రీలంక గతి పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment