పాండు యాదవ్, ఎన్.గౌతంరావు, శ్యామ్‌సుందర్, హరీష్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంస్థాగత బలోపేతం, స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ గ్రేటర్ నగరంలో పావులు కదిపింది. మహానగరాన్ని ఆరు జిల్లాలుగా విభజిస్తూ కొత్త కమిటీలు ఏర్పాటు చేసింది. ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా ఆరుగురు కొత్త అభ్యర్థులకు పార్టీ పగ్గాలు అప్పగిచింది. ఇందులో గోల్కొండ –గోషామహల్ జిల్లా అధ్యక్షునిగా పాండు యాదవ్, భాగ్యనగర్ –మలక్‌పేట అధ్యక్షునిగా సంరెడ్డి సురేందర్‌రెడ్డి, మహంకాళి–సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షునిగా శ్యాంసుందర్‌గౌడ్, బర్కత్‌పురా – అంబర్‌పేట జిల్లా అధ్యక్షునిగా డాక్టర్.ఎన్ గౌతంరావులను నియమించారు. వీరితో పాటు ఇటీవలే పార్టీలో చేరిన కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకుడు పన్నాల హరీష్‌రెడ్డిని మేడ్చల్ అర్బన్ అధ్యక్షునిగా, టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఎల్బీనగర్ నియోజకవర్గ నాయకుడు సామ రంగారెడ్డికి రంగారెడ్డి అర్బన్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. చదవండి: (అంతా బోగస్: భట్టి)
రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ తరహా కమిటీలపై పార్టీ సీనియర్ నాయకులు కొందరు అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర కమిటీలో తమ అనుయాయులకు స్థానం దక్కలేదని పలువురు బహిరంగ విమర్శలకే దిగారు. అయితే వచ్చే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కొనే లక్ష్యంతో వేసిన ఈ కమిటీలు ముఖ్యనాయకులు, కార్యకర్తలు, పాత, కొత్త శ్రేణులను ఎలా సమన్వయం చేస్తూ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఏ మేరకు ఎదుర్కొంటాయో వేచి చూడాల్సి ఉంది.
- రంగారెడ్డి అర్బన్: సామ రంగారెడ్డి
- మేడ్చల్ అర్బన్: హరీష్‌రెడ్డి పన్నాల
- గోల్కొండ గోషామహల్: వి.పాండుయాదవ్
- భాగ్యనర్ మలక్‌పేట: సంరెడ్డి సురేందర్‌రెడ్డి
- మహంకాళి – సికింద్రాబాద్: శ్యాంసుందర్ గౌడ్
- బర్కత్‌పురా – అంబర్‌పేట: డాక్టర్ ఎన్.గౌతంరావు
మేడ్చల్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి
సాక్షి, మేడ్చల్ జిల్లా: త్వరలో జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గ్రేటర్ శివారులోని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పార్టీ రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. విస్తరణే లక్ష్యంగా పట్టణ ప్రాంతాలైన మల్కాజిగిరి ,ఉప్పల్, కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని 8 మున్సిపల్ డివిజన్లు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మూడు మున్సిపల్ డివిజన్లు కలుపుతూ మేడ్చల్ బీజేపీ అర్బన్ జిల్లా కమిటీని ఖరారు చేశారు. అధ్యక్షుడిగా పి.హరిష్‌రెడ్డిని పార్టీ అ«ధిష్టానం మంగళవారం ప్రకటించింది. అయితే..మేడ్చల్ అర్బన్, రూరల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దాదాపు నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న మాధవరం కాంతారావు మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్ష పదవి ఆశించటంతోపాటు మోజారిటీ నాయకులు, కేడర్ కూడా మొగ్గు చూపినప్పటికిని, రాజకీయ సమీకరణలో భాగంగా చివరి నిమిషంలో హరీష్‌రెడ్డిని పదవి వరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.
హరీష్‌రెడ్డి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లిలో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొద్ది రోజుల తర్వాత బీజేపీలో చేరారు. ఇక జిల్లాలోని రూరల్ ప్రాంతమైన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 61 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్, కొంపెల్లి మున్సిపాలిటీలను కలుపుతూ మేడ్చల్ రూరల్ జిల్లా కమిటీగా ప్రకటించిన పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా పి.విక్రంరెడ్డిని నియమించింది. ఇక్కడ కూడా రేసులో మరో ఇద్దరు భోగారం ఎంపీటీసీ సభ్యుడు సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి కందాడి సత్తిరెడ్డి ఉన్నప్పటికిని, కేడర్ అభిప్రాయాలకు అనుగుణంగా విక్రంరెడ్డిని ఖరారు చేసినట్లు తెలుస్తున్నది. విక్రంరెడ్డి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడుగా సుదీర్ఘ కాలం పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment