జిందాబాద్‌లుండవు.. నినాదాలు వినిపించవు.. సభ, ర్యాలీల ఆర్భాటాలు కనిపించవు.. కానీ, జరగాల్సిన ప్రచారం జరిగిపోతుంది. చెప్పాల్సింది క్షణాల్లో లక్షలాది మందికి చేరిపోతుంది. ఇది కదా ప్రచారమంటే! ఇప్పుడన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియానే అసలైన ‘గొంతుక’గా మారింది. ఎంతమంది కార్యకర్తలున్నా.. ఎంత మందీ మార్బలమున్నా, ఎంత గొప్ప ఉపన్యాసాలిచ్చినా.. అది ప్రజలకు చేరకపోతే వృథానే. పైగా కరోనా విజృంభిస్తోన్న తరుణంలో భారీగా జనసమీకరణ, బహిరంగసభలంటే ప్రజలే కాదు, కార్యకర్తలూ జంకుతున్నారు. అందుకే, అన్ని పార్టీలు బయట లక్షలాదిగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా సరే.. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రచార వేదికలుగా చేసుకుంటున్నాయి. సామాజిక మాధ్యమాల్లో తమ ఖాతాలకు ఎంతమంది ఫాలోవర్లు ఉంటే.. తమ పోస్టులు అంతకుమించి జనాల్లోకి చేరతాయని పారీ్టలు విశ్వసిస్తున్నాయి. అందుకే, తమ పార్టీ సోషల్‌మీడియా విభాగాలను క్రియాశీలం చేశాయి. అన్ని పారీ్టల్లోని ‘సోషల్ సైనికులు’తమ పోస్టులు, షేర్లతో ప్రచార వేడిని రెండింతలు చేస్తున్నారు.
ఎన్నికల్లో జెండాలు, ఎజెండాల కంటే ప్రచారం సందర్భంగా జరుగుతున్న ఘటనలే ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఇటీవలి దుబ్బాక ఉప ఎన్నిక నిరూపించింది. అసలు పోటీలోనే లేదనుకున్న బీజేపీ సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఏకంగా దుబ్బాక సీటును ఎగరేసుకుపోయింది. దీంతో అప్పటిదాకా సోషల్ మీడియాను ఎగతాళి చేసిన పార్టీలు, నాయకులు కూడా దానికి పెద్దపీట వేస్తున్నారు. కరోనా దెబ్బకు యువకులు, విద్యార్థులందరి చేతికి స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. డేటా, సోషల్‌మీడియా వినియోగం పెరిగింది. ఇప్పుడు ప్రజల్ని ప్రభావి తం చేయడం పెద్ద పనికాదు. సోషల్ మీడియాలో వచ్చే ఒక్క పోస్టు కూడా జనంలోకి నేరుగా దూసుకుపోతుంది. ప్రచారం రూపేణా లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆదరణ సోషల్ మీడియా ద్వారా వస్తుందని భావించే టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పారీ్టలు ఈ మాధ్యమాన్ని విరివిగా వాడుకునే పనిలో పడ్డాయి.
అటు ప్రచారం.. ఇటు పైసలు
వివిధ సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులకు ఆకర్షితులై వ్యాపారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన పార్టీలు, నాయకులకు భారీగా విరాళాలు కూడా ఇస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడ్డ నగరవాసులతో అన్ని పార్టీలు నిరంతరం టచ్‌లో ఉంటున్నాయి. వారి నుంచి విరాళాలే కాదు, పారీ్టలకు మద్దతుగా వారి వీడియోలను కూడా సేకరిస్తున్నాయి. వీటిని స్థానిక ఓటర్లను ప్రభావితం చేసేందుకు, తమ ఓటుబ్యాంకు నిలుపుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయి. ఫలానా సమయంలో తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్లే మీకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకోవడం కూడా పలు పార్టీలకు కలిసివస్తోంది. హైదరాబాద్‌లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలుంటారు. అందుకే, అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేందుకు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ కంటెంట్‌ను అన్ని పార్టీలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్.. చివరికి వాట్సాప్‌లోని స్టేటస్‌లు, డీపీలు, ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌ల ద్వారా కూడా ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు, సోషల్‌మీడియా విభాగాల సిబ్బంది జోరుగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా గంటగంటకు వాట్సాప్ స్టేటస్‌లతో లక్షలాదిమందిని ప్రభావితం చేయవచ్చని కొన్ని పారీ్టలు గుర్తించి అనుకూలంగా మలుచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు దాదాపు అన్ని వాట్సాప్ గ్రూపుల్లోనూ గ్రేటర్ ఎన్నికలపైనే జోరుగా చర్చలు నడుస్తున్నాయి.
కంటెంట్‌కు డిమాండ్
రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం అంతా ఎవరికి వారే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అన్ని పార్టీల సోషల్ మీడియా వింగ్‌లు ఇటీవల తాత్కాలిక ప్రాతిపదికన కంటెంట్ రైటర్లు, పీఆర్వోలు, కార్టూనిస్టులు, వీడియో ఎడిటర్లు, డీటీపీ ఆపరేటర్లను భారీగా నియమించుకున్నాయి. ప్రత్యర్థులపై పదునైన ‘పంచ్’వేస్తూ చేసే పోస్టులకు ప్రాధాన్యమిస్తున్నారు. వ్యంగ్య కా ర్టూన్లు, వెటకారం నిండిన వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఈ పనిచేసినందుకు ఒక్కొక్కరికి 15 రోజుల కోసమే రూ. 50 వేల దాకా ముట్టజెపుతున్నారంటే వీరికి ఎంతప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
పీఆర్ ఏజెన్సీల చేతిలో ‘ట్విట్టర్ హ్యాండిల్స్’
పలువురు ప్రముఖుల ట్విట్టర్ హ్యాండిళ్ల నిర్వహణ బాధ్యతను పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ఏజెన్సీలు చూస్తుంటాయి. వివిధ పరిణామాలపై ఇవి సదరు నాయకుని అభిప్రాయాన్ని తెలియజేస్తుంటాయి. సంతాపాలు, శుభాకాంక్షలు వంటివి క్షణాల్లో సదరు నేతల హ్యాండిళ్లలో ప్రత్యక్షం అవుతున్నాయంటే అదంతా పీఆర్ ఏజెన్సీల పనే. రాష్ట్రంలో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్నది టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తరువాత ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసద్. ఫేస్‌బుక్, ట్విట్టర్లలో వీరి ఫాలోవర్ల సంఖ్య మిలియన్ మార్కు దాటింది. చాలామంది రాష్ట్ర నాయకుల సోషల్ మీడియా ఖాతాలను సీనియర్ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ కంటెంట్ రైటర్లు, విశ్రాంత విలేకరులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment