జైపూర్: త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ రాజస్థాన్‌లో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. ఎన్నికలకు సన్నాహకంగా ఏర్పాటు చేయనున్న రెండు కమిటీ సభ్యులను ప్రకటించింది. కానీ ఈ కమిటీల్లో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత వసుంధర రాజే పేరు లేకపోవడం విశేషం.
రాజస్థాన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్రంలో సంకల్ప్ మ్యానిఫెస్టో కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ పేరిట రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 21 మంది సభ్యుల ఎన్నికల నిర్వహణ కమిటీకి మాజీ ఎంపీ నారాయణ్ లాల్ పంచారియా నేతృత్వం వహిస్తుండగా 25 మంది సభ్యుల సంకల్ప్ కమిటీకి కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ నాయకత్వం వహించనున్నారు.
ఈ కమిటీల్లో ఎంపీ కిరోడీ లాల్ మీనా, మాజీ కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లకు చోటు లభించగా రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తోపాటు రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి, ప్రతిపక్ష నాయకుడు రాజేంద్ర రాథోడ్ ల పేర్లను ఈ కమిటీ జాబితాల్లో చేర్చకపోవడం చర్చనీయాంశమంది. గత కొన్నాళ్లుగా వీరంతా రాష్ట్రంలో బీజేపీ ప్రచార బాధ్యతలను భుజాన మోస్తున్నారు. మాజీ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాజీ రాష్ర అధ్యక్షుడు సతీష్ పూనియాలకి కూడా ఈ కమిటీల్లో చోటు దక్కలేదు.
ఇదిలా ఉండగా ప్రస్తుత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకుని వెళ్లడంలో బీజేపీ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి తోపాటు మహిళలపై జరుగుతున్న అరాచకాలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అయితే మరో అడుగు ముందుకేసి 'నహీ సహేగా రాజస్థాన్' పేరిట పేపర్ లీకేజీ, రైతు సమస్యలపై నిరసన తెలుపుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఎలా చూసినా గెహ్లాట్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న సంక్షేమ పథకాలను తిప్పికొట్టడమే బీజేపీకి పెను సవాలుగా మారింది. కాంట్రాక్టు ఉద్యోగుల బిల్లు, ఆరోగ్య హక్కు బిల్లు వంటి ప్రజాహితమైన పథకాలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఊతంగా నిలవనున్నాయి. కర్ణాటకలో కూడా ఇదే విధంగా ఐదు గ్యారెంటీలతో రూపందించిన పథకాలు అక్కడ ఆ పార్టీ అధికారంలో రావడానికి దోహద పడ్డాయి. రాజస్థాన్‌లో కూడా అదే పాచిక పారుతుందని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉండగా బీజేపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నాల్లో ఉంది. అందుకోసమే కమిటీలను ఏర్పాటు చేసి ఎన్నికల ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇది కూడా చదవండి: కొడుకు చేసిన పనికి తండ్రికి శిక్ష.. పార్టీ సభ్యత్వం రద్దు..
Comments
Please login to add a commentAdd a comment