సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి నాలుగున్నర శతాబ్దాల చరిత్ర ఉందని, వాణిజ్యం, వ్యాపారం, విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, కళలకు పేరొందిందని బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుంటే హైదరాబాద్ సంకనాకిపోతుందంటూ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యల పట్ల బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...హరీశ్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఓటమి భయంతో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతున్నారన్నారు. నిజాం కాలం కంటే ముందు నుంచే హైదరాబాద్ ప్రపంచ ఖ్యాతి గడించిందని, హరీశ్ అతని మామ కేసీఆర్ పుట్టకముందు నుంచి ఎన్నో రకాలుగా ఘనత సాధించిన నగరమని వివరించారు. జనరిక్ మెడిసిన్ ఉత్పత్తిలో అతి ముఖ్యమైన నగరం హైదరాబాద్ అని, ఇందులో బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాత్ర ఏంటి అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో మాఫియా రాజ్యం పోవాలన్నా వేగంగా అభివృద్ధి చెందాలంటే బీఆర్‌ఎస్ ఓడిపోవాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న బీజేపీ కార్యకర్తలను జైలులో వేస్తోందని, ఇప్పటివరకు హైదరాబాద్‌లో హమాస్‌కు మద్దతుగా ర్యాలీ తీస్తుంటే బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తోందన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment