ఈటల రాజేందర్ రూట్ మార్చేశారా?.. గతంలో మంత్రిగా ఉన్నపుడు హుజూరాబాద్‌కే పరిమితమయ్యేవారు. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అటువైపు రావడమే మానేశారా?. గులాబీ బాస్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించే క్రమంలో రూట్ మార్చారా? తనపైనే ఫోకస్ చేస్తూ.. పదవులు కట్టబెడుతున్న తరుణంలో.. తానెక్కడి నుంచి బరిలోకి దిగుతారనే విషయంలో కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారా? వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచే బరిలో ఉంటారా? ప్లేస్ మార్చుతారా? ఈటల ఆలోచన ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
గులాబీ బాస్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నపుడు ఈటల రాజేందర్ ఎప్పుడూ తన నియోజకవర్గమైన హుజూరాబాద్‌లోనే కనిపించేవారు. కేసీఆర్‌ను ధిక్కరించి బయటకొచ్చాక కూడా నియోజకవర్గానికి ఎన్నడూ దూరంగా లేరు. అయితే, గత ఉప ఎన్నికలో తనను టార్గెట్ చేస్తూ గులాబీ దళం చేసిన ముప్పేట దాడితో ఈటల ఉక్కిరిబిక్కిరి అయింది వాస్తవం. గులాబీ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం మాత్రం ఈటలనే వరించింది.
ఈ పరిణామం గులాబీ దళపతిని మరింత అసహనానికి గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగానే ఈ ప్రాంతం నుంచి నలుగురికి రాష్ట్రస్థాయి కార్పోరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసి.. విప్‌గా క్యాబినెట్ హోదా కల్పించడమ కాకుండా.. హుజూరాబాద్ ఇన్‌చార్జ్ బాధ్యతలు కూడా అప్పగించారు. జరుగుతున్న పరిణమాలన్నీ ఇప్పుడు ఈటలలో మధనానికి కారణమయ్యాయా అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.
తెలంగాణ అంతటా ఈటల పర్యటన..
కేసీఆర్ వ్యూహ రచన గురించి బాగా తెలిసినవాళ్లలో ఈటల రాజేందర్ కూడా ఒకరు. ఈ క్రమంలో గులాబీబాస్ వ్యూహాలకు ప్రతివ్యూహంగా ఈటల అడుగులు వేస్తున్నారా..? అందుకే తరచూ పర్యటిస్తూ ఉండే సొంత నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారా..? బీజేపీ ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ హోదాను ఆసరా చేసుకుని.. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతూ.. రాబోయే ఎన్నికల నాటికి తన ఛరిష్మాను ఇంకా పెంచుకోవడంతో పాటు.. తానెక్కడ నిలబడ్డా గెలవగలిగే అనుకూల పరిస్థితులను సృష్టించుకుంటున్నారా?. ఈక్రమంలో ఏ నియోజకవర్గం అయితే తనకు అనుకూలంగా ఉంటుందనే అంచనాలు వేసుకుంటున్నారా అని చర్చ జరుగుతోంది. రాష్ట్రమంతా పర్యటిస్తున్న ఈటల ఎప్పుడూ లేనివిధంగా తన నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో.. అసలు వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తారా? మరో నియోజకవర్గం ఎంచుకుంటారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది.
ప్లాన్ మార్చనున్న ఈటల?
ఈటల రాజేందర్ హుజూరాబాద్ నుంచే మళ్లీ బరిలోకి దిగొచ్చూ, లేకపోవచ్చు.. ఎన్నికలనాటికి రాజకీయ సమీకరణాల ఆధారంగా పరిస్థితులు మారిపోతాయి. కానీ, తననే ఫోకస్ చేస్తూ తనను ఎలాగైనా ఓడించాలన్న కసితో ఉన్న గులాబీబాస్‌నే ఒకింత కన్ఫ్యూజ్ చేసే క్రమంలోనే ఈటల అడుగులెటువైపో తెలియకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది. తన చిరకాల ప్రత్యర్థిలా మారిన గులాబీ బాస్ కేసీఆర్ మీద లేదంటే జిల్లాలో ప్రధాన ప్రత్యర్థిగా తయారైన మంత్రి గంగుల కమలాకర్ మీద గానీ ఈటల బరిలోకి దిగే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈటల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఈ ఫొటో గుర్తుందా?
Comments
Please login to add a commentAdd a comment