సోమవారం తమను సభ నుంచి సస్పెండ్ చేయడంతో నిరసన తెలుపుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తదితరులు
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం కాగా, జాతీయ గీతాలాపన తర్వాత స్పీకర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2022–23 వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా బడ్జెట్ ప్రసంగంతో సభను ప్రారంభించడంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ స్థానాల నుంచి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు.
నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతున్న క్రమంలో పది నిమిషాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తమ స్థానాల వద్ద నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతుండటంతో.. సీఎం కేసీఆర్ సూచన మేరకు హరీశ్‌రావు ప్రసంగం ఆపడం, మంత్రి తలసాని అసెంబ్లీ రూల్స్ 340, సబ్ రూల్ 2 ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని టీఆర్‌ఎస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదించడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అసెంబ్లీ ఆవరణలో బైఠాయింపు
సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు సభనుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్‌ను పిలిపించారు. తొలుత రాజాసింగ్‌ను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ‘కేసీఆర్ రాజ్యాంగం నడవదు’అంటూ రాజాసింగ్ నినదించగా, ‘మోదీ రాజ్యాంగం నడవదు’అని టీఆర్‌ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రఘునందన్‌రావును కూడా మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా, చీఫ్ మార్షల్ కరుణాకర్ ఈటల వద్దకు వెళ్లి సభ నుంచి వెళ్లాల్సిందిగా కోరడంతో ఆయన కూడా బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఆవరణలో వారు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, కేసీఆర్ నియంతృత్వ వైఖరి నశించాలి’అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన, వాకౌట్
ఆర్టికల్ 171 ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే ముందు గవర్నర్ ప్రసం గం ఉండాలంటూ సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు రాజ్యాంగం ప్రతిని చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క,, పోడెం వీరయ్య తమ స్థానాల్లో నిలబడి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సుమారు అరగంట పాటు ఆ విధంగా విజ్ఞప్తి చేసినా స్పీకర్ స్థానం నుంచి స్పందన లేకపోవడంతో 12 గంటల సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment