సాక్షి, న్యూఢిల్లీ: దమ్ముంటే తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ ఛుగ్ సవాల్ చేశారు. ఎన్నికలపై కేసీఆర్ చేసిన సవాల్‌ను స్వాగతిస్తున్నామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోరాడేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.
మంచి పనులేవైనా త్వరగా జరగాలని, అందుకే కేసీఆర్ అసెంబ్లీని త్వరగా రద్దు చేయాలన్నారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో తరుణ్ ఛుగ్ మీడియాతో మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తానన్న హామీని కేసీఆర్ మరిచిపోయారని.. ప్రజలు 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు ఈ విషయాన్ని గుర్తు చేస్తారని చెప్పారు.
కేసీఆర్ కుటుంబంలో వణుకు
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, పరేడ్ గ్రౌండ్స్ సభలో లక్షల మంది ప్రజలు మోదీ.. మోదీ.. అని చేసిన నినాదాలను చూసి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం వణికిపోతోందని తరుణ్ ఛుగ్ అన్నారు. ఎనిమిదేళ్ల నుంచి చేసిన అవినీతి పాపాలుగా మారి కేసీఆర్‌ను భయపెడుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను ఉద్దేశిస్తూ వాడిన అసభ్య పదజాలం సరికాదన్నారు.
తెలంగాణలో ‘బీజేపీ డబుల్ ఇంజన్’ సర్కారు ఖాయం
‘‘ప్రధాని మోదీ భారతదేశాన్ని విశ్వ గురువు గా మార్చాలనుకుంటే కేసీఆర్‌కు ఉన్న సమ స్య ఏంటిæ? కేసీఆర్ దేశ ప్రగతికి ఎందుకు వ్యతిరేకం?’’అని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. ప్రజలపై భారం పడొద్దని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పెట్రోల్ ధరలను తగ్గిస్తే.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ధరలను ఏమా త్రం తగ్గించలేదని మండిపడ్డారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలోనే ఎక్కువన్నారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డా యని వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా, ఫామ్‌హౌజ్‌లో విలాస జీవితం గడిపే సీఎంకు దేశ ప్రజల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ అంటే కేసీఆర్‌కు తెలుసా?
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తరుణ్ ఛుగ్ తప్పుపట్టారు. ఎమర్జెన్సీ పరిస్థితులుంటే ఆదివారం రాత్రి కేసీఆర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తారా? అని నిలదీశారు. కొన్ని అంశాల్లో తెలంగాణ నంబర్ వన్ అని సీఎం కేసీఆర్‌తో ఏకీభవిస్తున్నానని.. బాలలపై నేరాల్లో, మిగులు రాష్ట్రాల జాబితా నుంచి అప్పుల ఊబిలో కూరుకుపోయిన జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. కేంద్రం, బీజేపీపై అనవసర విమర్శలు మాని.. తెలంగాణలో వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలు, రైతులను ఆదుకోవడంపై కేసీఆర్ దృష్టి సారించాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment