సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వినూత్న వ్యూహంతో కమలదళం ముందుకు వెళ్లనుంది. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీ పిస్తున్నా టికెట్లు ఖరారు కాలేదంటూ, మేనిఫెస్టో, ప్రచార వ్యూహమే ఖరారు కాలేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. ఒక్కసారిగా అన్ని వైపుల నుంచీ దూకుడు పెంచేలా కార్యా చరణ ప్రణాళిక అమలు చేయనున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.
పార్టీ లోని పాత, కొత్త నేతలతోపాటు తటస్థులు, మేధావులు, ప్రముఖులకు ఈసారి పోటీ అవకాశం కల్పించాలని జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్టు వివరిస్తున్నాయి. మొత్తం 119 స్థానాల్లో ఎస్సీ 19, ఎస్టీ 12 సీట్లుపోగా మిగతా 88 సీట్లలో యాభై శాతానికిపైగా బీసీలు, ఇంతవరకు శాసనసభలో అడుగుపెట్టని ఎంబీసీ కులాల వారికి టికెట్లు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయం జరిగిందని పేర్కొంటున్నాయి. మొత్తంగా అన్నివర్గాలకు ప్రాధాన్యత కల్పించి ఎన్నికల గోదాలోకి దిగాలనే ఆలోచనతో ఉన్నట్టు వివరిస్తున్నాయి.
దూకుడుగా ప్రచారం చేపట్టేలా..
అన్ని ప్రసార, ప్రచార సాధనాలు, మీడియా, సోషల్, డిజిటల్ మీడియాలలో ఒకేసారి దూకుడుగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించినట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రాధాన్యతా అంశాల వారీగా.. ముఖ్యంగా అందులో బీసీలు, ఎంబీసీలు, మహిళలకు సంబంధించిన సమస్యలు, అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు వివరిస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం, ప్రాంతానికి అన్నట్టుగా కాకుండా మొత్తంగా 119 సీట్లకు వర్తించేలా కామన్ ఎజెండాతో ముందుకెళ్లాలనే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్టు తెలిసింది. తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్ సర్కారు పాలన లోపాలు, వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి, సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు, అవినీతి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం.
అంతా కలసి ముందుకు..
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీలోని పాత, కొత్త, జూనియర్, సీనియర్ నేతలు అంతా కలసి ముందుకు సాగుతున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో దశాబ్దాలుగా పార్టీలో ఉంటూ బీజేపీ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లు, ఇతర పార్టీల నుంచి చేరి ప్రధానమైన బాధ్యతల్లోని వారూ ఉన్నారని అంటున్నాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ఇన్‌చార్జి మురళీధర్‌రావు, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి, సీనియర్ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎన్.రామచంద్రరావు తదితరులు కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment