పూణే : మహరాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకి ఎదురుదెబ్బ. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహరాష్ట్ర అధికార మహాయుతి కూటమి ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికల్లో పోటీచేయాలని భావిస్తోంది. దీంతో ఆ కూటమి తరఫున ప్రస్తుత సీఎంగా కొనసాగుతున్న షిండే మరో మారు ముఖ్యమంత్రి అవుతారా? లేదంటే రాజకీయ ఎత్తుగడలకు బలవుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
ఇటీవల మహరాష్ట్ర లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి అంచనాలు తలకిందులయ్యాయి. 48 పార్లమెంట్ స్థానాలకు గాను జరిగిన ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి 17 స్థానాలు.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి 30 స్థానాల్లో విజయం సాధించాయి.
బీజేపీ ముందే జాగ్రత్త పడుతోంది
ఆ ఫలితం సెప్టెంబర్ - అక్టోబర్ నెలల మధ్య కాలంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అధికార మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ముందే జాగ్రత్త పడుతోంది. అందుకే ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకొని అధికార పీఠాన్ని అధిష్టించాలని పావులు కదుపుతోంది.
ఏక్‌నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు
ఇందులో భాగంగా 288 మంది అసెంబ్లీ స్థానాలకు ఒక్క బీజేపీ మాత్రం 160 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆసక్తని కనబరుస్తుండగా..మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండేకి చెక్ పెట్టేందుకు సీఎం అభ్యర్ధి ఎవరనేది ప్రకటించకుండానే ఆ ఎన్నికల ప్రచారం చేసేలా కూటమిలోని ఇతర పార్టీ అధినేతలు, ముఖ్యనేతలతో చర్చ జరుపుతుందని సమాచారం.
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి
288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలు నేరుగా తలపడనున్నాయి. అధికార మహాయుతి కూటమికి బీజేపీ నేతృత్వం వహిస్తుండగా.. బీజేపీకి శివసేన (యూబీటీ),ఏక్‌నాథ్ షిండే వర్గం..నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గం మద్దతు పలుకుతున్నాయి. ప్రతిపక్ష ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎన్సీపీలు (శరద్‌చంద్ర పవార్)లు కీలక భాగస్వామ్యాలుగా ఉన్నాయి.
శరద్ పవార్ వర్గం వైపు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎన్నికల్లో పోటీ చేయడం దాదాపూ ఖరారైనట్లేనని ‘మహ’ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేసే కేవలం ఒక సిటుకే పరిమితం కావడంతో అజిత్ పవార్ వర్గం నేతలు.. శరద్ పవార్ వర్గంలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా సుమారు 15 మంది అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలు శరద్ పవార్ టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీన్ని అదునుగా భావించిన శరద్ పవార్ తన వర్గం ఎన్సీపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకు అనుగుణంగా ఎమ్మెల్యేలను ఆహ్వానించేందుకు మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
#WATCH | BJP leader Pankaja Munde celebrates with her supporters she wins Maharashtra MLC polls
All 9 Mahayuti candidates have won Maharashtra MLC polls.
(Video source: Pankaja Munde's Office) pic.twitter.com/WwzsdjqXYY— ANI (@ANI) July 12, 2024
అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీకి ఊరట
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమనేలా తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు సంకేతాలిచ్చాయి. గత వారం విడుదలైన 12 ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి 9 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ ఐదు స్థానాలు,ఏక్‌నాథ్ షిండే వర్గం (2), అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం (2) స్థానాల్లో గెలుపొందారు. యూబీటీ శివసేన నుంచి ఒక అభ్యర్థి, కాంగ్రెస్ నుండి ఒకరు విజయం సాధించారు. ఈ ఎన్నికల గెలుపునే రెఫరెండంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేలా బీజేపీ ఎన్నికల ప్రచారం చేసేందుకు సమాయత్తమవుతుంది. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు, ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరనేది తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment