కర్నూలులో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు సునీల్ థియేధర్, జీవీఎల్, కన్నా, వీర్రాజు, పురంధేశ్వరి, టీజీ తదితరులు
సాక్షి ప్రతినిధి కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోకూడదని రాష్ట్రంలోని 13 జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు అభిప్రాయపడ్డారు. బీజేపీతో పొత్తులేకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవని, తమ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తిరిగి బీజేపీకే వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుల అభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉండదని పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇన్‌చార్జ్‌లు సునీల్ దియోధర్, మధుకర్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలుస్తోంది. రెండురోజుల పాటు కర్నూలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలులోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్ హాలులో ఈ నెల 20, 21 తేదీలలో నిర్వహించారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జ్ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్‌చార్జ్ సునీల్ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు 13 జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లు, పదాధికారులు పాల్గొన్నారు. సమావేశం హాలులోకి మీడియాను కూడా అనుమతించలేదు. సమావేశం తర్వాత కూడా విషయాలను బయటికీ వెల్లడించలేదు. అయితే సమావేశానికి హాజరైన బీజేపీ ముఖ్యనేతలు ఇద్దరు విషయాలను ‘సాక్షి’కి వెల్లడించారు. వారి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీతో పొత్తుకు ఒప్పుకునే ప్రసక్తే లేదు
బీజేపీ విధానం, పార్టీ బలోపేతం, 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ సిద్ధం కావడంతో పాటు పొత్తు అంశాలపై చర్చించారు. చంద్రబాబునాయుడు బీజేపీ పొత్తుతో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు మాత్రమే అధికారంలోకి వచ్చారని, బీజేపీతో కలవకుండా అతను అధికారంలోకి వచ్చిన సందర్భమే లేదని 13 జిల్లాల అధ్యక్షులు వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత బలంగా ఉన్నారని, ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చంద్రబాబు చేయరని, తిరిగి బీజేపీతో జతకట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారని చర్చించారు. ఎట్టిపరిస్థితుల్లో టీడీపీతో పొత్తు ఉండకూడదని 13 జిల్లాల అధ్యక్షులు మూకుమ్మడిగా నిర్ణయించారు. పార్టీ కోసం కష్టపడిన వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని కోరారు. దీనికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు కీలక నేతలు స్పందించారు. ఎట్టిపరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు ఉండదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. చంద్రబాబును ఆపార్టీ నేతలే నమ్మే పరిస్థితిలో లేరని, కేవలం పొత్తులపై ‘మైండ్‌గేమ్’ ఆడుతున్నారన్నారు. జనసేనతో కూడా పొత్తులపై ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని, పవన్‌కల్యాణ్‌తో పాటు జనసేన నేతల్లో స్థిరమైన నాయకత్వం లేదని, అలాంటివారిని నమ్మి ఇప్పటికిప్పుడు నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లలేమని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
సంస్థాగతంగా బలోపేతంపై దృష్టి ఏదీ?
బీజేపీ ఇన్‌చార్జ్‌లతో పాటు రాష్ట్ర అధ్యక్షుడికి జిల్లా అధ్యక్షుల నుంచి సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఎదురైనట్లు తెలుస్తోంది. జాతీయపార్టీగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో కనీసం ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే గెలవలేదంటే పార్టీ సంస్థాగతంగా బలంగా లేకపోవడమే కారణమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్ననేతలే బీజేపీలో ఉన్నారని, వారు బీజేపీ కాకుండా టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు అనిపిస్తోందని ఓ వ్యక్తి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్‌ను దృష్టిలో పెట్టుకుని విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. సీఎం రమేశ్, సుజనా చౌదరి టీడీపీలో ఎంత క్రియాశీలకంగా పనిచేశారో, చంద్రబాబుకు, వారికి మధ్య ఉన్న ధృడమైన బంధం ఎలాంటిదో, ఎలాంటి పరిస్థితుల్లో వారు బీజేపీలో చేరారో అందరికీ తెలిసిందే! ఇలాంటి వ్యక్తుల మాటలు విశ్వసించి పార్టీలో నిర్ణయాలు తీసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని సునీల్ దియోధర్‌తో పాటు సుప్రకాశ్‌కు పలువురు అధ్యక్షులు వ్యక్తిగతంగా కలిసి వివరించినట్లు తెలుస్తోంది.
బైరెడ్డి గైర్హాజరు... పార్టీ వీడతారని చర్చ
సమావేశానికి బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి గైర్హాజరయ్యారు. కనీసం రాష్ట్ర, జాతీయస్థాయి నేతలను వ్యక్తిగతంగా కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. జనవరి 22న ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ప్రజానిరసన సభలో కూడా ఆయన పాల్గొనలేదు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బైరెడ్డి బీజేపీని వీడతారనే చర్చ జిల్లాలో నడుస్తోంది.
టీజీ వెంకటేశ్ వైఖరిపై ఫిర్యాదులు
జిల్లా అధ్యక్షులు వ్యక్తిగతంగా పార్టీ నేతలతో కలిసి ముచ్చటించిన సందర్భంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ వైఖరిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆయన బీజేపీలో, ఆయన తనయుడు టీడీపీలో కొనసాగుతున్నారని, ఈ వైఖరితో కర్నూలు ప్రజల్లో టీజీ ఫ్యామిలీ విశ్వసనీయత కోల్పోయిందని చెప్పినట్లు తెలుస్తోంది. ఉంటే ఇద్దరూ బీజేపీలో, లేదంటే టీడీపీలో కొనసాగాలని, రెండు పడవలపై ప్రయాణం వద్దని కర్నూలు జిల్లా నేతలు సునీల్ దియోధర్‌కు చెప్పినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment