బీజేపీఎల్పీ భేటీలో రాజాసింగ్, సంజయ్, ఈటల
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని.. వివిధ వర్గాల ప్రజల సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం కేసీఆర్ హామీల అమలు అంశాలను లేవనెత్తాలని బీజేపీ నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లు, మద్యం అమ్మకాలు, విద్యావైద్య వ్యవస్థలోని లోపాలు తదితర అంశాలను ప్రస్తావించాలని తీర్మానించింది. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఆ పార్టీ సభాపక్షనేత రాజాసింగ్, సీనియర్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ నేతలు స్వామిగౌడ్, ఎన్.రామచంద్రరావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు. పలు కారణాల వల్ల ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఈ భేటీకి హాజరుకాలేదు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ రోజురోజుకూ బలహీనపడుతోందని, బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని.. అందుకే సీఎం కేసీఆర్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారని సమావేశంలో నేతలు పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడొద్దు: సంజయ్
మందబలంతో టీఆర్‌ఎస్ రెచ్చగొట్టే అవకాశం ఉందని, పార్టీ ఎమ్మెల్యేలు సంయమనంతో వ్యవహరించాలని సంజయ్ సూచించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో తీవ్ర అసహనంలో ఉన్న అధికార టీఆర్‌ఎస్ ట్రాప్‌లో పడ కుండా జాగ్రత్త వహించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాలను సద్వినియోగం చేసుకుని, రాష్ట్రంలో బీజేపీ బలపడటానికి మార్గం వేయాలన్నారు. టీఆర్‌ఎస్ మంద బలంతో పదేపదే రెచ్చగొట్టే అవకాశం ఉందని రాజాసింగ్ చెప్పారు.
పర్యటనల పేరుతో కేసీఆర్ కొత్త డ్రామాలు
‘ఇక్కడ తన పనైపోయిందని తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల పర్యటనలకు వెళ్తున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో వేలాది మంది రైతులు చనిపోతే ఒక్కరికీ నయాపైసా సాయం చేయని కేసీఆర్ జార్ఖండ్ వెళ్లి జవాన్లకు సాయం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం నారాయణపేట జిల్లా పెద్దకొర్ల గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన 25 మంది నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ‘టీఆర్‌ఎస్ సర్కార్‌పై వ్యతిరేక ఓట్లను చీల్చి లబ్ధి పొందాలని కుట్ర చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈసారి ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలనే నిర్ణయించారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment