ఢిల్లీ: రానున్న పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్ల గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే పలు వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సహా పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్, ప్రతిపక్ష ఇండియా కూటమిలో విమర్శల స్థాయిని పెంచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పలు రాష్ట్రాల్లో పొత్తులో భాగం సీట్ల పంపకం విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తూ దూసుకుపోతోంది. అయితే బీజేపీ సైతం తమ అభ్యర్థులను త్వరలో ప్రటించనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే గురువారం బీజేపీ.. దాదాపు 100 మంది లోకసభ అభ్యర్థులతో మొదటి జాబితాను ప్రటకటించనున్నట్లు సమాచారం. ఈ వందమంది జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వచ్చే గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ భేటీ అనతరం బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేస్తుందని సమాచారం. అయితే అభ్యర్థుల మొదటి జాబితా బీజేపీకి కీలకం కానుంది. బీజేపీ ఈసారి 370 సీట్లు గెలువాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తంగా 400 సీట్లలో గెలుపొందాలని టార్గెట్ పెట్టుకుంది.
ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి సెగ్మెంట్ నుంచి పోటీ చేసి.. భారీ విజయాలను నమోదు చేసుకున్నారు. 2014లో 3.37 లక్షల మేజార్టీ, 2019లో 4.8 లక్షలకు భారీ మేజర్టీతో విజయం సాధించారు. ఇక..2019 సార్వత్రిక ఎన్నికల్లో హోంమంత్రి అమిత్‌షా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో పోటీ చేసి గెలుపొందారు. గతంలో ఆ లోక్‌సభ స్థానంలో బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే. అద్వానీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతికి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘నేను దేశంలో వస్తున్న మార్పును అంచనా వేయగలను. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తుంది. బీజేపీ సైతం సొంతంగా కనీసం 370 సీట్లలో విజయం సాధిస్తుంది’ అని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment