సాక్షి, అమరావతి: హత్యలు చేసే కడప వాళ్లకు ఎయిర్‌పోర్టా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలను క్షమాపణలు కోరారు. 'రాయలసీమ రతనాల సీమ ఈ పదం నా హృదయంలో పదిలం. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వెనక్కి తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు. రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలనేదే బీజేపీ ఆలోచన' అని సోమువీర్రాజు అన్నారు.
చదవండి: (పాడి రైతులకు మంచి రోజులు : సీఎం జగన్)
ఇదిలా ఉండగా, ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాలన్న ప్రణాళికలో ఉన్నట్లు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ జిల్లాలకు ఎయిర్‌పోర్టులు ఎందుకంటూ వ్యాఖ్యానించారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో.. ‘జిల్లాకో ఎయిర్‌పోర్టు ఎందుకు? కర్నూలులో ఎయిర్‌పోర్టు.. బస్సులు వెళ్లడానికి దారిలేనటువంటి కర్నూలులో ఎయిర్‌పోర్టు.. రాయలసీమకు ఎయిర్‌పోర్టులంట.. కడపలో ఎయిర్‌పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్‌పోర్టు.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు. మేం ఎయిర్‌పోర్టు వేస్తాం. ఏం వేస్తారండి ఎయిర్‌పోర్టు.. మీరు రోడ్లు వెయ్యండి..’ అంటూ రాయలసీమ ప్రజలను కించపరిచే విధంగా వీర్రాజు వ్యాఖ్యలు చేశారు. వీర్రాజు వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు మండిపడుతుండడంతో తన వ్యాఖ్యలపై వెనక్కు తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment